ఒళ్లు పెంచుకుంటే సరిపోదని, కాస్త బుర్ర పెంచుకోవయ్యా అని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ సందర్భంలో గట్టిగా హితవు చెప్పారు. ఈ హితవు అచ్చెన్నకు జగన్ ఊరికే చెప్పలేదని ఇప్పుడు అర్థమవుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల విషయమై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రంలో మోదీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో వున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఎంత మాత్రం లేదని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. సీఎం జగన్ తనకు తానుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఎంతమాత్రం వుండదు. ఒకవేళ ఏదైనా కారణంతో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటే ఆయన చేయగలిగేదేమీ లేదు.
ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు కామెంట్స్ ఆయన రాజకీయ అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. వైసీపీ ప్రభుత్వ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని, ఓటమి భయంతో ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అంతరార్థం ఇదే అన్నారు. ఎన్నికలు త్వరగా పెట్టాలని బీజేపీ పెద్దల్ని జగన్ బతిమలాడుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ అనుకుంటే మోదీ సర్కార్ను బతిమలాడుకోవాల్సిన అవసరం జగన్కు లేదనే ఇంగిత జ్ఞానం అచ్చెన్నకు కరువైందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేస్తే, ఆటోమేటిక్గా ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని వారు చెబుతున్నారు. 2018లో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన ఎన్నికలకు వెళ్లిన వైనాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఏదో ఒకటి విమర్శించాలనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడ్డం అచ్చెన్నకు అలవాటైందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే బాడీ పెంచుకోవడం కాదని, కాస్త బుర్ర పెంచుకోవాలని అచ్చెన్నకు జగన్ ఎందుకు చెప్పారో ఆయన అజ్ఞానంగా మాట్లాడినప్పుడల్లా గుర్తొస్తున్నాయని వెటకరిస్తున్నారు.