హైదరాబాదు నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకి ధారాదత్తం చేసిన వైనం గమనిస్తే ఎవరైనా సరే విస్మయానికి గురవుతారు. ప్రతిరోజూ కొన్ని వేల వాహనాలు తిరుగుతూ ఉండే ఈ ఔటర్ రింగ్ రోడ్డులో టోల్ ఫీజుల వసూలు అనేది ఎంత కనిష్టంగా లెక్క వేసినా వందల కోట్ల రూపాయల లో ఉంటుందనే మాట వాస్తవం.
అలాంటిది నిత్యం లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాలో కురిపిస్తూ ఉండే బంగారు కోడి పెట్టాలాంటి ఈ ప్రాజెక్టును ఏకంగా 30 ఏళ్ల పాటు ఒక ప్రైవేటు సంస్థకు లీజ్ ఇవ్వడమే అర్థంలేని పని అనే విమర్శలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇవ్వడమే అర్ధరహితం అనుకుంటుండగా, 30 ఏళ్ల కాలవ్యవధికి కేవలం 7380 కోట్ల రూపాయల మొత్తానికి ఇవ్వడం అనేది ఇంకా చిత్రంగా కనిపిస్తోంది.
కారు చౌకగా లీజు కట్ట పెట్టేసారని ప్రజలందరికీ అనిపిస్తున్న ఈ డీల్ కెసిఆర్ ప్రభుత్వం మీద కొత్త సందేహాలు పుట్టడానికి కారణం అవుతుంది. ఈ లీజు ఒప్పందాన్ని ఖరారు చేయడంలో భారీగా ముడుపులు చేతులు మారాయని అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏకంగా 1000కోట్ల రూపాయల ముడుపులు కేసీఆర్ కుటుంబానికి అందినట్లుగా చెబుతున్నారు. ఈ ఒప్పందాన్ని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోయేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో ఈ ఏడాది చివరన జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందంపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆయన చెబుతున్నారు. అవినీతికి పాల్పడిన టిఆర్ఎస్ నాయకులతో పాటు కంపెనీ ప్రతినిధులు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని ఆయన బెదిరిస్తున్నారు.
ఈ బెదిరింపులన్నీ 'కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే' అనే సంభావ్య నిబంధనతో ముడిపడి ఉన్నవి. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణం లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదా అనేది ప్రజల సందేహం! ఒకవైపు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ భారాసతో జట్టుకట్టవచ్చు అని అనుమానాలు కూడా కొందరికి ఉన్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఈసారి ఎన్నికలలో అధికార బి ఆర్ ఎస్ కు ప్రధాన పోటీదారుగా ఉండబోతున్న బిజెపి ఈ ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయంలో ఎందుకు మౌనం పాటిస్తోంది అనేది ప్రజలకు అర్థం కాని సంగతి. పరంగా ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా దాన్ని చిలువలు పలువలు చేసి గోరంతలు కొండంతలుగా పెంచి అడ్డగోలుగా నిందలు వేయడానికి ఉవ్విళ్లూరుతూ ఉండే కమల నాయకులు ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయంలో కిమ్మనడం లేదు.
భారాస పట్ల ప్రజలలో విముఖత ఉండి అధికార మార్పిడిని కోరుకుంటే కనుక, అంతో ఇంతో బిజెపికి అవకాశం దొరుకుతుందనేది అనేకమంది అంచనా. కానీ ఆ పార్టీ ఈ విషయంలో మౌనం పాటిస్తుంది. ఈ లీజు వ్యవహారాన్ని తెలిపితే జాతీయ రహదారులన్నింటిపై టోల్ ఫీజులకు కేటాయించే విధానాలు .. అందులో జరిగే తమ కేంద్ర ప్రభుత్వ అవినీతి దందాలు ఏమైనా బయటకు వస్తాయని వారు భయపడుతున్నారో ఏమో తెలియదు.
మొత్తానికి అవుటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారం అనేది కేవలం అధికారంలో ఉన్న భారాస మీద మాత్రమే కాదు.. వారిని ఓడించి గద్దె ఎక్కుతాం అంటున్న బిజెపి మీద కూడా ప్రజలకు నమ్మకాన్ని పోయేలా చేస్తుంది.