ఆయన రాజా వారు. సంస్థానాధీశులు. రాజకీయాల్లో అనేక పదవులు నిర్వహించిన వారు. కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖకు నాలుగేళ్ళుగా అమాత్యులుగా ఉన్న వారు. ఆయనే పూసపాటి అశోక్ గజపతిరాజు. తెలుగుదేశంలో సెల్ఫీ చాలెంజ్ అంటూ తమ్ముళ్ళు ఆరాటంతో ఉబలాటంతో ఎక్కడ చూసినా సెల్ఫీలు తీసి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.
దీంతో పెద్దాయన అశోక్ కూడా సెల్ఫీ చాలెంజ్ అని ఒక రోడ్డు గురించి పెట్టారు. దీని మీద డిప్యూటీ స్పీకర్ విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. రాజా వారు కూడా సెల్ఫీ చాలెంజ్ చేయడమేంటి అని ఎకసెక్కమాడేశారు.
విజయనగరానికి సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న అశోక్ తాను ఇన్నేళ్ళ పదవీకాలంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని కోలగట్ల డిమాండ్ చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎవరు ప్రజల మధ్యన ఉన్నారో ఎవరు లేరో అన్నది జనాలకు బాగా తెలుసు అని చురకలు అంటించారు. జనాల మధ్యకు ఇద్దరు వెళ్ళి తేల్చుకుందామని, ఎవరు ఎంత అభివృద్ధి చేశారు, ఎవరు జనం కోసం ఉన్నారు అన్నది వారే చెబుతారు అని కోలగట్ల అశోక్ కి సూచించారు.
రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇవ్వనున్నారని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలుస్తాను అని విజయనగరంలో ఇల్లిల్లూ తిరిగిన ఘనత తనదేనని కోలగట్ల ఢంకా భజాయించి మరీ చెప్పుకున్నారు. ఆయన కొత్తగా సవాల్ చేశారు. ఈసారి ఎన్నికల్లో వేరుగా కాదు కలసే ప్రచారం చేద్దామని, జనాలు ఎవరిని ఎన్నుకుంటారో చూద్దామని అశోక్ కి సరైన చాలెంజ్ చేశారు.
అశోక్ బంగ్లా దాటి రాకుండా విమర్శలు చేస్తే ఊరుకుంటామా అని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. పెద్దాయన సెల్ఫీ చాలెంజ్ మిస్ ఫైర్ అయిందా లేక వైసీపీలో కొత్త ధీమాను పెంచిందా అన్నది ఆలోచించాసిన విషయమే.