అయ్యా రజనీకాంత్! మీకొక వణక్కం

జీవితంలో కొన్ని విషయాల్లో మొహమాటాలు పడకూడదు.. ఎవరైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు ఎగేసుకుని వెళ్లిపోకూడదు.. వెళ్లినా అతిగా మాట్లాడకూడదు.. మాట్లాడినా ఎవరి పండగకో వచ్చి వారి శత్రువుని పొగడకూడదు.  Advertisement ఇలాంటి పంచ్ డైలాగులు…

జీవితంలో కొన్ని విషయాల్లో మొహమాటాలు పడకూడదు.. ఎవరైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు ఎగేసుకుని వెళ్లిపోకూడదు.. వెళ్లినా అతిగా మాట్లాడకూడదు.. మాట్లాడినా ఎవరి పండగకో వచ్చి వారి శత్రువుని పొగడకూడదు. 

ఇలాంటి పంచ్ డైలాగులు సినిమాల్లోనూ, వేదికల మీదా కొట్టి చప్పట్లు కొట్టించుకునే రజనీకాంత్ ఎందుకో లయతప్పారు. ప్రతి విషయాన్ని కూలంకషంగా విశ్లేషిస్తూ జ్ఞానిలా కనపడే రజని ఎందుకోగాని తొలిసారి తడబడ్డారు. 

చంద్రబాబు, బాలకృష్ణ కలిసి ఎన్.టి.ఆర్ శతజయంతి పేరుతో చేస్తున్న కార్యక్రమానికి అతిథిగా పిలిచారు రజనీని. ఎన్.టి.ఆర్ అంటే రజనీకాంత్ కి గౌరవం, అభిమానం రెండూ ఉండొచ్చు. ఆ ఇద్దరూ కలిసి “టైగర్” అనే సినిమాలో నటించారు కూడా. ఆ రకంగా ఇద్దరూ కొలీగ్స్ కూడా. పిలుపు రాగానే వెళ్లాలనిపించడం సహజం. కానీ పిలిచింది ఎవరు? ఎన్.టి.ఆర్ ని వెన్నుపోటు పొడిచిన శత్రువు, ఆ పోటుకి తన మౌనంతో ప్రోత్సాహాన్ని అందించిన ఆయన సుపుత్రుడు బాలకృష్ణ. బహిరంగంగానే తన శత్రువు చంద్రబాబు అని ప్రకటించారు ఎన్.టి.ఆర్. అదే భావనతో ఆయన కన్ను మూసారు. 

ఎన్.టి.ఆర్ పోయింది ఎవరి వల్ల అనే ప్రశ్న అడిగితే ఎవ్వడైనా కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్ల, చంద్రబాబు వెన్నుపోటు వల్ల అనే చెప్తారు. మరి వాళ్లు పిలిస్తే వెళ్లడమేంటి? ఆ చరిత్ర రజనీకంత్ కి తెలియదా? 

అసలు చంద్రబాబు ఎన్.టి.ఆర్ కి ఏ పండుగ చేసినా ఆయన ఆత్మ శాంతించదు. అయినా సిగ్గులేకుండా చేస్తుంటాడు తన రాజకీయ అవసరాల కోసం. 

చంద్రబాబు తన సొంత తండ్రి ఫోటోకి దండ వేయడం ఎవ్వరూ చూడలేదు. కానీ ఏటేటా మామగారి ఫోటోకి దండేస్తాడు. పోనీ తన పార్టీ స్థాపకుడిగా ఆ పని చేస్తున్నాడా అంటే ..అసలా పార్టీ ఎన్.టి.ఆర్ ది కానే కాదని పార్టీని, గుర్తుని, అకౌంటులో ఉన్న లక్షల డబ్బుని కోర్టు ద్వారా తన పేరున రాయించుకున్న ఘనుడు కదా చంద్రబాబు. అలాంటప్పుడు ఎందుకు ఈ వేడుకలు? తెదేపా ఎన్.టి.ఆర్ ది కానప్పుడు ఆయన చంద్రబాబుకి కేవలం మామగారు మాత్రమే. మరి తండ్రిని పక్కనపెట్టి మామగారి విగ్రహానికి పూజలేంటి? అది కూడా పదివి పోయినప్పుడే. ఉన్నప్పుడు పెద్దగా గుర్తురాడు పెద్దాయాన. ఇలా చిన్నపిల్లాడు కూడా వెక్కిరించే స్థాయిలో ఉంటాయి బాబు రాజకీయాలు. 

ఇవన్నీ రజనీకాంత్ లాంటి మేథావికి తెలియవని కావు. కానీ ఎంత మేథావి అయినా ఒక్కోసారి తప్పులు చేస్తాడు. చంద్రబాబు పిలిస్తే వెళ్లడమే తప్పనుకుంటే ఆ వేదిక మీద అతన్ని ఆకాశానికెత్తుతూ పొగిడారు రజని. అంటే రామనవమి వేడుకలో రావణాసురుడ్ని కీర్తించినట్టన్నమాట. 

ఎందుకిదంతా అంటే ఒకవేళ మళ్లీ పసుపు జెండా పవర్లోకి వస్తే తనకి, తన కుటుంబసభ్యులకి చంద్రబాబు ఏదో ఒకటి చేస్తాడేమో అనే ఆశతో కావొచ్చు. లేదా దగ్గరుండి తీసుకొచ్చింది బాలకృష్ణ కాబట్టి అతని గన్ కల్చర్ కి సంబంధించిన వార్త గుర్తొచ్చి భయపడైనా అయ్యుండొచ్చు. తెరమీద తలైవా అయినా బయట భయస్తుడేనేమో. 

రజనీకాంత్ సినిమా అంటే ఒకప్పుడు సెన్సేషన్. కానీ ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే వయసైపోయి కాదు..ఆయనకి శ్రద్ధ పోయి సరైన సినిమాలు ఎంపిక చేసుకోవట్లేదు. శేషజీవితంలో సాధ్యమైనన్ని సినిమాలు చేసేసి సొమ్ములు మూటకట్టుకుని సంతానానికి ఇవ్వాలనే ఆత్రం అంతే. అదే ఆత్రం, ఆరాటం చంద్రబాబుని పొగడడంలో కూడా చూపిస్తున్నాడు. సినిమాల్లో శ్రద్ధలేక, రాజకీయ దృక్కోణంలో నిలకడ లేక కిందామీదా పడుతున్న వ్యక్తి ప్రస్తుత రజనీకాంత్. కాసేపు రాజకీయాల్లోకి వస్తానని, కాసేపు రానని, కాసేపు సొంత పార్టీ అని, కాసేపు డీ.ఎం.కే కి సపోర్ట్ అని..ఇలా రకరకాలుగా కాలక్షేపం చేసి రాజకీయ ఆలోచనల్ని విరమించుకున్నానని ప్రకటించిన వ్యక్తి రజిని. 

అదలా ఉంచితే, ఈ ఎన్.టి.ఆర్ వేడుకకి పెద్దాయన మనవడు మరొక పెద్ద స్టార్ హీరో అయిన జూ. ఎన్.టి.ఆర్ ని పిలవలేదు. ఎందుకు పిలవలేదని రజనీ అడిగి ఉండకపోవచ్చు. ఆ కుటుంబానికి చెందిన నటవారసత్వం బాలకృష్ణతో ఆగిపోలేదు కదా. అతనికంటే పెద్ద స్థాయిలో సాగుతోంది జూ. ఎన్.టి.ఆర్ కెరీర్. చంద్రబాబుని పొగిడే ఫ్లోలో జూనియర్ ని కూడా పొగిడుంటే చిత్తశుద్ధితో మాట్లాడాడని అనుకోవచ్చు. మాట్లాడలేదంటే బాలకృష్ణైనా అతని ప్రస్తావన తీసుకురావొద్దని చెప్పుండాలి, లేదా రజనీకి వీళ్ల ఫ్యామిలీ ఈక్వేషన్స్ ఆల్రెడీ తెలుసుండాలి. ఈ రెండింటిలో ఏది నిజమైనా రజనీ తన స్థాయికి తగ్గి ప్రవర్తించారనే చెప్పుకోవాలి. ఆబ్లిగేషన్ ఫీలయ్యి పక్షపాతాన్ని చూపారని నమ్మాలి. 

ఇన్ని దశాబ్దాలుగా ఎంతమంది ఫాన్స్ ని సంపాదించుకున్నా, ఒక్క బాబుని పొగిడి తన బలహీనమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి చాలామంది ఫ్యాన్స్ ని దూరం చేసుకున్నారు రజని. రజిని నటుడిగా పైమెట్టుమీదే ఉన్నా, వ్యక్తిగా మాత్రం కనీసం వందమెట్లు జారిపడ్డారు చంద్రబాబుస్తుతి వల్ల. అయ్యా! రజనీకాంత్! మీకొక వణక్కం. మళ్లీ ఈ తప్పు చేయకండి. మీ కీర్తికి అక్కర్లేని తుప్పు అంటించుకోకండి. 

–  అనీల్ కుమార్ . K