వైఎస్ వివేకానందరెడ్డి హత్యానంతర పరిణామాల గురించి పచ్చ మీడియా వీరవిన్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పటికి ఇంకా పోలింగ్ కు నెల రోజులకు పైనే సమయం ఉంది. అంటే.. ప్రభుత్వం పూర్తిగా చంద్రబాబు నియంత్రణలోనే ఉంది. మొదట సిట్ ఏర్పటైంది కూడా చంద్రబాబు ప్రభుత్వ కనుసన్నల్లోనే. అప్పటి హోం మంత్రి, అంత కన్నా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ కనుసన్నల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మొదలైందనేది సత్యం.
మరి ఒక హత్య కేసును తేల్చడానికి అయినా, దాన్ని కంగాళీగా మార్చడానికి అయినా బహుశా ఆ హత్య జరిగిన తర్వాది నెల రోజుల సమయం చాలేమో అనుకోవచ్చు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు జరిగిన సమయంలో అధికారం చంద్రబాబు చేతిలో ఉంది. ఆ కేసుకు సంబంధించి నిజంగానే అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంటే, అప్పటికప్పుడు ఎందుకు అరెస్టు జరగలేదు? నెల రోజుల సమయం కూడా సరిపోలేదా? అవినాష్ ప్రమేయం నిరూపించడానికి! అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు తొలి సిట్ ను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అయినా, అప్పటికి అధికారం అంతా పచ్చవర్గాల చేతిలోనే ఉన్నా… విచారణ మాత్రం సవ్యంగా జరగలేదని స్పష్టం అవుతోంది.
ఒక మాజీ ఎంపీని, మాజీ మంత్రిని కొంతమంది నరికి చంపితే, ఆ హత్య జరిగిన ఐదారు గంటల్లోపే పోలీసులు అక్కడకు చేరినా, ఆ తర్వాతి కొన్ని గంటల్లోనే విచారణకు ఒక సిట్ నియమితం అయినా.. ఎందుకు విచారణ సవ్యంగా జరగలేదో తెలుగుదేశం పార్టీనే చెప్పాలి! హత్య జరిగిన మొదటి రోజు నుంచి నెల రోజుల పాటు కీలక సమయం కాదా? ఆధారాలను సేకరించడానికి అయినా, హత్యకు సంబంధించి పూర్వాపరాలను వెలికి తీయడానికి అయినా, ఆ సమయం సరిపోలేదా!
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సిట్ ఏర్పాటు అయినా.. నెల రోజుల పాటు సమయం దొరికినా, విచారణ ఎలాంటి కొలిక్కి రాలేదంటే.. ఈ హత్యకు ప్రాథమిక కారణాలు ఏవీ టీడీపీకి రాజకీయంగా పనికి రాలేదనే అనుకోవాలి! ఒకవేళ ఈ హత్యకు సంబంధించి రాజకీయంగా తమకు ప్రయోజనాలను కలిగించే అంశాలు ఏమైనా ఉంటే.. అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాటిని బయట పెట్టేది. అది కూడా పోలింగ్ కు నెల రోజుల ముందు కాబట్టి.. నానా రచ్చ చేసి ఉండేది. అయితే తొలి నెలనాళ్లలోనే ఈ కేసులో వైఎస్ కుటుంబీకులను ఎలా ఇరికించాలనే అంశంలోనే గట్టి కసరత్తూ సాగిందనేది మరో వెర్షన్!
ప్రత్యేకించి నాటి ఇంటెలిజెన్స్ చీఫ్.. ఈ హత్య విచారణలో జోక్యం చేసుకున్నాడని, అసలు కారణాలు తనకు అనవసరం వీలైనట్టుగా వైఎస్ కుటుంబీకులనే ఈ కేసులో ఇరికించాలనే లక్ష్యంతో ఆయన విచారణను తీవ్రంగా ప్రభావితం చేశారనే ఆరోపణలూ వచ్చాయి. పులివెందుల నడిబొడ్డున ఆ నియోజకవర్గంలో పేరున్న నేతను నరికి చంపి వెళితే ఎవరు చంపారు, ఎందుకు చంపారు… అనే అంశాలను తేల్చడానికి ప్రభుత్వానికి తొలి నెల రోజుల సమయం కీలకమే కాదు, మొత్తం కథంతా బయటకు తీసుకురావొచ్చు.
అయితే అలా వెలుగులోకి వచ్చే వాస్తవాలతో తమకు రాజకీయ ప్రయోజనం లేదు అందుకే, వాటిని తొక్కి పట్టి ఆదిలోనే ఈ కేసు విచారణను భ్రష్టు పట్టించి ఉండవచ్చు కూడా! అప్పటికే వివేక హత్య రాజకీయం కావడంతో ఆదిలోనే ఈ కేసును అడ్డదారి పట్టించడానికి టీడీపీ ప్రభుత్వమే ఎందుకు వ్యూహాన్ని పన్ని ఉండదనుకోవాలి?