వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి రకరకాల రూమర్లను ప్రచారంలోకి పెట్టడంలో పచ్చవర్గాలు ఆరితేరిపోయాయి. వివేకానందరెడ్డి హత్య గురించి టీడీపీ నేత బీటెక్ రవి ఇటీవల ఒక మీడియాధినేతకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఓపెన్ హార్ట్ సర్జన్ ఏదేదో మాట్లాడారు. పరిటాల రవి హత్యలో నిందితులు చనిపోయారంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. మరి పరిటాల రవి హత్య జరిగిందెప్పుడు? 2005లో! ఆ హత్య కేసులో మొద్దు శ్రీను జైల్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. అలాగే మొద్దు శ్రీనును చంపిన ఓం ప్రకాష్ అనే రౌడీషీటర్ కూడా ఆ తర్వాత అనారోగ్య కారణాలతో చనిపోయాడు. ఇదంతా కుట్ర అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
బాగానే ఉంది, మరి 2005లో పరిటాల రవి హత్య తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడింది? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాటి అనంతపురం జిల్లా ముఖ్య నేత, మంత్రి జేసీ దివాకర్ రెడ్డిలు పరిటాల రవిని హత్య చేయించారని కదా! స్వయంగా పరిటాల రవి భార్య ఇచ్చిన ఫిర్యాదులో జగన్, దివాకర్ రెడ్డిల పేర్లు లేవా? పరిటాలను హత్య చేయించాడంటూ జేసీపై సంవత్సరాల పాటు టీడీపీ ఆరోపించింది కదా, పోరాడింది కదా! మరి పరిటాల రవిని హత్య చేయించిన జేసీని టీడీపీ ఎలా చేర్చుకుంది? అదే జేసీ దివాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ లు జేసీతో కలిసి ఎలా రాజకీయం చేశారు?
తన భర్తను జగన్, జేసీలు కలిసి హత్య చేయించారని వందల సార్లు వాపోయిన సునీతకు ఆ తర్వాత జేసీ పవిత్రుడు అయ్యాడా? పరిటాల హత్య తర్వాత జేసీ దివాకర్ రెడ్డి బస్సులపై దాడులకు పాల్పడిన తెలుగుదేశం శ్రేణులు మళ్లీ జేసీని ఎలా భుజాన మోశారు, మోస్తున్నారు? జేసీని ఫ్యాక్షన్ నేతగా తూలనాడిన చంద్రబాబు ఇప్పుడు ఆయనను సీనియర్ నేతగా కీర్తిస్తూ ఉంటారు. ఆ మధ్య జేసీల ఇంటికి వెళ్లి లోకేష్ విందారగించారు!
మరి పరిటాల రవి హత్య గురించి ఇప్పుడు పచ్చవర్గాలు మాట్లాడటమే సిగ్గు చేటు. తాము ఇచ్చిన కంప్లైంట్ లోని ప్రముఖుడితో రాసుకుపూసుకు తిరుగుతూ.. ఇంకా పరిటాల రవి హత్య అంటూ మాట్లాడటం పచ్చవర్గాల సిగ్గులేని తనానికి నిదర్శనం!
ఇక ఇదే ఇంటర్వ్యూలో సునీతకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారని.. మెడికల్ కాలేజీ లైసెన్స్ నో, కాంట్రాక్టునో ఏదో ఇస్తానంటూ ఈ కేసు గురించి మాట్లాడొద్దు అన్నట్టుగా ఆయన చెప్పాడని, అయితే సునీత మాత్రం పోరాడుతోదంటూ బీటెక్ రవి కితాబులిచ్చాడు! మరి ఇదే నిజమైతే.. ఇదే విషయాన్ని సునీత చెప్పలేదా?
తనతో జగన్ ఏమేం అన్నాడో ఇప్పటికే సునీత చెప్పిందని పచ్చమీడియానే చెబుతోంది. అవినాష్ ను అనుమానించాల్సి వస్తే నీ భర్తను ఎందుకు అనుమానించకూడదు? అంటూ జగన్ తనను ప్రశ్నించాడంటూ సునీత సీబీఐతోనో, పచ్చమీడియాతోనో చెప్పిందని పచ్చమీడియానే చెబుతోంది. మరి అంత చెప్పిన సునీత..తన నోరు మూయించడానికి జగన్ తనకు మెడికల్ కాలేజీ ని ఆఫర్ చేశాడని చెప్పలేదా? ఎలాగూ జగన్ పార్టీ వర్సెస్ సునీత మాటాల యుద్ధమూ జరుగుతోంది కదా.. అలాంటప్పుడు ఈ విషయాన్ని సునీత ప్రస్తావించదా? దీన్ని ప్రస్తావించడానికి బీటెక్ రవి లేచొచ్చాడా!
మరి ఇంతగా వివేకపై అభిమానులన్న ఈ బీటెక్ రవి కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమమార్గంలో వివేకపై ఎలా నెగ్గాడు? స్థానిక సంస్థల కోటాలో పూర్తి బలం వైఎస్ వివేక వైపు ఉండింది. 90 శాతం బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు, పది శాతం బలంతో తెలుగుదేశం తరఫున బీటెక్ రవి ఎలా గెలిచారు? అప్పుడు వివేక వ్యక్తిత్వంపై కానీ, నాయకత్వ నేపథ్యంపై కానీ బీటెక్ రవికి విలువ లేదా? ప్రజాపోరాటంలో వివేకపై బీటెక్ రవి నెగ్గలేదు. కేవలం ఎంపీటీసీలను మేనేజ్ చేసి గెలిచారు. అది కూడా పది శాతం లోపు ఓట్లతో 90 శాతం ఓట్లున్న వైపు వారిని ఓడించారు.
ఇక మెడికల్ కాలేజీ వదంతి విషయానికి వస్తే.. దాని గురించి సునీత భర్త అడిగాడని, తమకు అలాంటి లబ్ధి చేకూర్చాలని జగన్ ప్రభుత్వాన్ని కోరాడని, దానికి కుదరదని చెప్పినందుకే ఈ వ్యవహారంలో వాళ్లు ఇలా చేస్తున్నారనే ఆరోపణలూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉన్నాయి! జగన్ గనుక అలాంటి ఆఫర్ ఇచ్చి ఉంటే.. సునీత ఈ పాటికే తనను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారంటూ గాయిగత్తర చేసే వాళ్లు. ఈ విషయం జనాలకు అర్థం కాదన్నట్టుగా బీటెక్ రవి పెద్ద లీకేదో ఇచ్చినట్టుగా రొటీన్ పచ్చ ప్రచారాన్ని చేస్తున్నారు. దానికి ఓపెన్ హార్ట్ సర్జన్ వంతపాట తోడు!