యమలీల సినిమాలో 'మా పుస్తకం పోయిందండి' అంటూ బ్రహ్మానందం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇస్తే ఎస్సై కోట శ్రీనివాసరావు షాకవుతారు. సరిగ్గా అలాంటి సిచ్యుయేషనే హైదరాబాద్ వనస్థలిపురం పోలీసులు ఫేస్ చేశారు. ఓ వ్యక్తి హడావిడిగా వచ్చి మా ఇంట్లో దొంగతనం జరిగిందండి అన్నాడు. డేట్, టైమ్ అన్నీ నోట్ చేసుకున్న పోలీసులు, ఆ తర్వాత పోయిన వస్తువుల వివరాలు అడిగారు. అంతే, షాకయ్యారు. అవును, మా పిల్లి పోయిందండీ అంటూ ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. అంతే కాదు పట్టుబట్టి మరీ కేసు రిజిస్టర్ చేయించాడు.
కుక్కలు, పిల్లులే కాదు, బల్లులు, తొండలు, ఊసరవెల్లుల్ని కూడా పెంచుకోవచ్చని.. ఇటీవల చీటోకి ప్రవీణ్ వంటివారి ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. అప్పుడప్పుడూ తమ పెంపుడు జంతువులు తప్పిపోయాయని కొంతమంది పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేస్తుంటారు కూడా. కనబడుటలేదు అంటూ ప్రకటనలు కూడా ఇస్తుంటారు. అయితే తమ పిల్లిని దొంగలెత్తుకెళ్లారంటూ వింత కేసు వనస్థలిపురంలో రిజిస్టర్ కావడం ఇదే తొలిసారి.
అరుదైన, విలువైన పిల్లి
అరుదైన జాతికి చెందిన పిల్లి కావడంతో దాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని, పక్కా ప్లానింగ్ తో ఆ పని చేసి ఉంటారని అంటున్నాడు యజమాని. వనస్థలిపురం పరిధిలోని జహంగీర్ కాలనీలో షేక్ అజహర్ మహమూద్ అనే వ్యక్తి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. ఆ పిల్లికి ఓ కన్ను ఆకుపచ్చ రంగులో, మరో కన్ను నీలం రంగులో ఉంటుంది. అందుకే అది అరుదైన పిల్లి అయింది.
దాన్ని 50వేల రూపాయలకు కొన్నాడు యజమాని. నోమనీ అనే పేరు పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఏడాదిన్నర వయసున్న ఆ పిల్లి ప్రత్యేకత, దాని రేటు చుట్టుపక్కలవారందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా దాని గురించి పోస్టింగ్ లు పెట్టేవాడు అజహర్ మహమూద్.
ఈ విషయం తెలియడంతో ఎవరో దానిపై కన్నేశారు. మంచి టైమ్, టైమింగ్ చూసుకుని దాన్ని చంకన పెట్టుకుని వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.