సీఎం రేవంత్ రెడ్డి మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ చివరకు ఒక్కటే నిర్ణయాన్ని అమలు చేస్తున్నాడు. ఆ ఒక్క నిర్ణయాన్ని మాజీ సీఎం కేసీఆర్ వ్యతిరేకించలేదు. కాబట్టి అది సాకారం దాలుస్తోంది. అదే తెలంగాణ అధికారిక గీతం జయజయహే తెలంగాణ. దీన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించలేదంటే అది ఆయన హయాంలో వర్కవుట్ కాలేదు కాబట్టి.
ఇక మిగతా రెండు నిర్ణయాలు అధికారిక చిహ్నంలో, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు. ఈ రెండు పనులను గులాబీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. చార్మినార్, వరంగల్ కాకతీయ తోరణం వద్ద కేటీఆర్ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం అంటే రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ పాలనలో రూపొందినవే. వాటిల్లో మార్పులు చేస్తామంటే కేసీఆర్ ఊరుకుంటాడా? ఆయనకు, ఆయన కుమారుడికి, పార్టీ నాయకులకు కోపం వచ్చింది.
రాజముద్ర అండ్ తెలంగాణ తల్లి రాజరిక పోకడలతో ఉన్నాయని, తెలంగాణ ఉద్యమ అమరుల ఆకాంక్షలను ప్రతిబింబిచేవిగా లేవని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డాడు. వాటిల్లో మార్పులు చేయాలని కసరత్తు చేశాడు. రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ చేత అధికారిక గీతం, కొత్త అధికారిక చిహ్నం, కొత్త తెలంగాణ తల్లిని ఆవిష్కరింపచేయాలని అనుకున్నాడు.
కానీ ఆయన అనుకున్న వాటిల్లో ఒక్కటే చేయగలుతున్నాడు. మొండిగా ముందుకుపోతే ఏం కొంపలు మునుగుతాయోనని వెనక్కి తగ్గాడు. బీఆర్ఎస్ మరింతగా రెచ్చిపోతే, గాయి గత్తర లేపితే అదో తలనొప్పిగా మారుతుంది. ఇదంతా అవసరమా అనుకున్నాడు. గులాబీ పార్టీ ఆందోళనను అర్థం చేసుకున్నట్లుగా వెనక్కి తగ్గాడు. చిహ్నం, తల్లి విగ్రహంలో మార్పుల జోలికి పోతాడో పోడో చెప్పలేం.
అందెశ్రీ పాటకు ఆంధ్రా వ్యక్తి కీరవాణి సంగీతం సమకూర్చడం ఏమిటని తెలంగాణ మ్యుజీషియన్స్, ఇంకా కొందరు అభ్యంతరం చెప్పినా గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఈ వివాదంలో తలదూర్చలేదు. ఎందుకంటే కేసీఆర్ తన హయాంలో ఆంధ్ర ప్రముఖులకు పెద్ద పీట వేసిన సంగతి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు తెలుసు. కీరవాణి సంగీతం ఇవ్వడం ఏమిటని కొందరు అభ్యంతరం చెప్పగానే కేసీఆర్ ఏం చేశాడో కొందరు కాంగ్రెస్ నాయకులు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. రీల్ రివైండ్ చేశారు.
కవిత బతుకమ్మ పాటల వీడియోకు తమిళ ఏఆర్ రెహమాన్ సంగీతం ఇచ్చాడని, తమిళ దర్శకుడు దర్శకత్వం వహించాడని గుర్తు చేశారు. యాదగిరిగుట్టను రీమోడల్ చేయడంలో ఆంధ్రకు చెందిన స్వామిజీ చిన్నజీయర్ స్వామి కీలకపాత్ర పోషించారు. దానికి యాదాద్రి అని పేరు పెట్టింది కూడా ఆయనే. యాదాద్రి పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి కళా దర్శకుడు ఆనంద్ సాయి కూడా ఆంధ్ర వ్యక్తే. తెలంగాణా చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా సినీ హీరోయిన్ సమంత వ్యవహరించింది. ఆమె తమిళనాడుకు చెందినదే కదా. ఇలా ఇంకా కొందరు ఉన్నారు.
అప్పుడు అభ్యంతరం చెప్పనివారు ఇప్పుడు కీరవాణికి అభ్యంతరం చెబుతున్నారు. కీరవాణిని అందెశ్రీ గట్టిగా సమర్ధించాడు. తెలంగాణలో కీరవాణిని మించిన సంగీత దర్శకుడు ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఉంటే చూపించాలని సవాల్ చేశాడు. కొందరేమో కీరవాణి మ్యూజిక్ ఇచ్చాడంటే తెలంగాణ గీతం సినిమా పాట మాదిరిగానే ఉంటుందని అంటున్నారు. ఆ పాట రిలీజ్ అయితేగాని ఎలా ఉందో తెలియదు.