తెలంగాణలో వామపక్షాల పరిస్థితి చూస్తే చాలా జాలి వేసేలా ఉంది. దక్షిణాదిలో కేరళ తర్వాత.. వామపక్షాలకు అంతో ఇంతో బలం ఉన్నది తెలంగాణలో మాత్రమే. ప్రస్తుతం ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను ఆశ్రయించి తమ రాజకీయ ఆస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఆరాటపడుతున్న వామపక్షాలకు పరిస్థితులు అంత ఆశావహంగా కనిపించడం లేదు. అయినా సరే వారు వెంపర్లాట గానీ, బతిమిలాడుకోవడం గానీ మానడం లేదు! జాతీయ రాజకీయాల్లో వామపక్షాల పొత్తు రాజకీయాలు ఒకరకంగా ఉంటే, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పోకడలను అనుసరిస్తూ, తద్వారా లబ్ధి పొందాలని ఎర్ర పార్టీలు కలగంటూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది!
తెలంగాణలో భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలని సిపిఐ, సిపిఎం ఆశపడుతున్నాయి. ఈ విషయంలో త్వరగా కేసీఆర్ తో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని కోరుకుంటున్నారు. భారత రాష్ట్ర సమితితో మునుగోడు ఎన్నికల సందర్భంగా ఏర్పడిన కొత్త బంధం ఇంకా తెగిపోలేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం తమ వల్ల మాత్రమే అక్కడ భారాస గెలిచిందని చాటుకుంటున్నారు. ఆరకంగా సిపిఐ, వచ్చే ఎన్నికల్లో తాము ఇతర ప్రాంతాల్లో గెలవడానికి భారాసను వాడుకోవాలని అనుకుంటోంది.
అయితే కెసిఆర్ వ్యూహం వేరే రకంగా ఉంది. జాతీయ రాజకీయాలలో ఇండియా కూటమి ఏర్పడిన నేపథ్యంలో అందులో కాంగ్రెసుతో జత కట్టిన పార్టీలలో వామపక్షాలు కూడా కీలకంగా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఆ పార్టీలను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎందుకు పొత్తు బంధంలోకి స్వీకరించాలి- అనే ప్రశ్న కెసిఆర్ ముందు ఉంది. వారితో కలిసి పోటీ చేస్తే కనుక ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన అనుకుంటున్నారు.
కలిసి ఎన్నికలకు వెళ్తే మరో మూడు నెలల తర్వాత ఆ రెండు పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేస్తాయని గ్యారెంటీ ఆయనకు లేదు. పైగా పార్లమెంట్ ఎన్నికల విషయాల్లో- తెలంగాణలో సీట్ల సంగతి ఆయనకు తొలి ప్రయారిటీ కాదు! ఇతర రాష్ట్రాలలో కూడా సీట్లు పొందడానికి ఉపయోగపడేట్లయితే ఆయన వామపక్షాలను చేరదీస్తారని అనుకోవచ్చు. అలా కాకుండా తెలంగాణ అన్ని రాష్ట్రాలలో సిపిఐ, సిపిఎం పార్టీలు కాంగ్రెస్ భజన చేస్తూ తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ వెంట ఉంటాం అంటే ఆయన నమ్మలేకపోతున్నారు.
ఒకవైపు తాము 15 స్థానాలపై దృష్టి పెట్టామని, ఐదు స్థానాలలో తప్పకుండా పోటీ చేస్తామని అంటున్న సిపిఐ తమను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న కేసీఆర్ ఎదుట బతిమిలాడుకునే ధోరణితో ప్రవర్తిస్తోంది. ఈ పరిణామాలు తెలంగాణలో వామపక్షాలకు ఎన్ని సీట్లు కట్టబడతాయో తెలియదు కానీ.. వారి పరువు తీసి గౌరవాన్ని పలచన చేస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.