ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసీఆర్ కుట్ర చేసాడని మాజీ మంత్రి చంద్రశేఖర్ అంటున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ఎందుకు నోరు విప్పాడో తెలియదు. ఒకవేళ ఇది నిజమే అనుకున్నాం. చంద్రబాబుపై తిరగబడడం కుట్ర ఎట్లా అవుతుంది? ఇది కుట్ర అయితే 1995లో ఎన్టీఆర్‌పై బాబు చేసింది ఏంటి? ఒక కుట్రదారుడిని దించడానికి చేసే ప్రయత్నం ప్రజాస్వామ్య రక్షణ కదా!
బాబు వల్ల తెలంగాణాకి న్యాయం జరగదని కేసీఆర్‌కి తెలుసు. అందుకే దించడానికి ప్రయత్నం చేసి వుంటారు. కుట్ర విఫలం చేసిన జ్యోతుల నెహ్రూకి తెలంగాణ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా సరే ఎక్కువ కాలం వుండేవాడు కాదు. గవర్నమెంట్ నిలబడాలంటే కాంగ్రెస్ మద్దతు కావాలి. అదును చూసి కాంగ్రెస్ ముంచేసేది. ఎన్నో ప్రభుత్వాల్ని ఆ రకంగా ముంచింది కూడా. ఈ కుట్రలో బొజ్జల పాల్గొన్నారంటే నమ్మశక్యం కాదు. వైశ్రాయ్ ఎపిసోడ్ ముందుండి నడిపించింది బొజ్జలే. ఆయన బతికి వుండగా చంద్రశేఖర్ ఈ మాట అంటే ఏం సమాధానం చెప్పేవాడో?
ఇక కేసీఆర్ కుట్ర చేసాడంటే కూడా నమ్మలేం. ఎందుకంటే బాబు గురించి ఆయనకి బాగా తెలుసు. ఎన్టీఆర్‌నే పడగొట్టిన బాబు మీద కుట్ర చేయాలంటే అంత ఈజీ కాదు. బిగినింగ్ నుంచి కుట్ర రాజకీయాల్లో ఆరితేరిన బాబు మీద గేమ్ ఆడాలంటే అంతకు పదింతలు కుట్ర తెలిసి వుండాలి. కేసీఆర్ ఉద్యమకారుడే కానీ, కుట్రదారుడు కాదు.
తెలంగాణ ఉద్యమం మీదే ఎన్నో కుట్రలు జరిగాయి. వాటిని తట్టుకుని జనం బలంతో ముందుకు సాగాడే తప్ప తాను కుట్ర జోలికి పోలేదు. ఎందుకంటే ఉద్యమ ఉదృతితోనే కేంద్రం మెడలు వంచాలే తప్ప, కుట్రలతో కాదని బాగా తెలుసు. పైగా కుట్రల కురువృద్ధులతో నిండిన కాంగ్రెస్ పార్టీ , కుట్రని ఉగ్గుపాలతో నేర్చుకున్న చంద్రబాబు మీద కుట్ర చేయాలంటే కేసీఆర్‌కి ఒక జీవితం సరిపోయేది కాదు.
జీఆర్ మహర్షి