టీడీపీని పదే పదే గుచ్చుతున్న జీవీఎల్

ఆయన పార్టీకి ఏపీలో ఓటు బ్యాంక్ ఎంతో ఉందో అందరికీ తెలుసు. అయినా కేంద్రంలో అధికారంలో ఉండడడంతో పాటు మోడీ లాంటి బలమైన నాయకుడు అవతల వైపు ఉండడంతో ఏపీలో పొత్తుల కోసం కొన్ని…

ఆయన పార్టీకి ఏపీలో ఓటు బ్యాంక్ ఎంతో ఉందో అందరికీ తెలుసు. అయినా కేంద్రంలో అధికారంలో ఉండడడంతో పాటు మోడీ లాంటి బలమైన నాయకుడు అవతల వైపు ఉండడంతో ఏపీలో పొత్తుల కోసం కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నాయి. బీజేపీతో ఉంటే రేపటి రోజున నైతికంగానే కాదు అన్ని రకాలుగా మద్దతు దక్కుతుందన్న ముందు చూపుతోనే ఈ పొత్తుల కోసం తాపత్రయపడుతున్నాయి.

అయితే దాన్ని పట్టుకుని బీజేపీ వారు ఎప్పటికపుడు చేస్తున్న ప్రకటనలు వింతగా ఉంటున్నాయి. అంతే కాదు తమ పార్టీ వెంట అంతా పడుతున్నట్లుగా కమలనాధులు కొందరు భావిస్తున్నారా అన్న డౌట్లూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అయితే సమయం దొరినపుడల్లా అనే మాట ఒక్కటే.

ఇక మీడియా అడుతున్న సందర్భంలోనూ ఆయన చెబుతున్నదీ అదే. ఏపీలో టీడీపీతో పొత్తులు ఉండవు. ఇదే మా విధానం అని జీవీఎల్ కుండబద్ధలు కొడుతున్నారు. మాకు ఏపీలో ఒక్క జనసేనతోనే పొత్తు అని క్లారిటీ  కూడా ఇస్తున్నారు. అంతే కాదు 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి  వచ్చేది కూడా బీజేపీ జనసేన కూటమి అని ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.

నిజానికి ఇవన్నీ కూడా టీడీపీని గుచ్చే మాటలుగానే చూస్తున్నారు. బీజేపీ మద్దతు వద్దు అని టీడీపీ గట్టిగా అనలేకపోతోంది. అలాగని పొత్తులు కావాలని బాహాటంగా అనకపోయినా అందరూ కలవాలని కోరుతోంది. ఈ రకమైన టీడీపీ వైఖరినే ఆసరాగా తీసుకుని బీజేపీ నాయకులు టీడీపీతో పొత్తా అని పెదవి విరుస్తున్నారు.

ఇది ఏపీలో నిన్నటి దాకా అధికారంలో ఉంటూ నేడు విపక్షంలో పెద్ద పార్టీ అయిన టీడీపీకి మాత్రం ఇబ్బందికరంగానే ఉందిట. అయినా మాకు బీజేపీతో పొత్తు వద్దు అని ఎందుకు అనలేకపోతున్నారు అన్నదే అంతా అనుకుంటున్న విషయం. 

పసుపు పార్టీలో నెలకొన్న ఈ రకమైన వాతావరణాన్నే కమలం పార్టీ పెద్దలు అడ్వాంటేజ్ గా తీసుకుని మాటలతో  చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇలా ఎంతకాలం సాగుతుందో అని తమ్ముళ్ళు అనుకుంటున్నారు అంటే తప్పు ఎవరిదో కదా.