“మహానాడుతో టీడీపీలో ఊపొచ్చింది. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలుపు టీడీపీదే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే టీడీపీకీ 160 సీట్లు గ్యారెంటీ.” చంద్రబాబు మీడియా ఎలివేషన్లు ఇవి. మరో పత్రిక అయితే మరో అడుగు ముందుకేసి, రాష్ట్రవ్యాప్తంగా సగటు ఓటరు మూడ్ టీడీపీ వైపు టర్న్ అయిందంటూ ఓ పెద్ద విశ్లేషణ కూడా రాసుకొచ్చింది.
ఇవన్నీ ప్రజల్ని టీడీపీ వైపు మళ్లించడం కోసం రాస్తున్న రాతలు. ఎలాగైనా తమ బాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే తాపత్రయం ఇదంతా. అయితే ఈ క్రమంలో పచ్చ మీడియా మొత్తం మరోసారి బాబును భ్రమల్లోకి నెట్టేస్తోంది. అదే ఇక్కడ ప్రధాన సమస్య.
2019లో సీన్..
2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు గతంలో ఎప్పుడూ లేనంత రిలాక్స్ గా కనిపించారు. గెలుపు మళ్లీ తనదే, తాను మినహా రాష్ట్రాన్ని ఎవరూ పాలించలేరు అన్నంత బిల్డప్ ఇచ్చారు. అనుకూల మీడియా కూడా అదే రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చింది. మళ్లీ బాబు వస్తేనే ఏపీ బాగుపడుతుందని, అమరావతి పూర్తవుతుందని, పోలవరం పూర్తవుతుందని ఊదరగొట్టింది.
కానీ రిజల్ట్ అందరికీ తెలిసిందే. టీడీపీ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా, టీడీపీ అనుకూల మీడియా ఎంతగా రెచ్చిపోయినా ఫలితం లేదు. అసలు ఎవరూ ఊహించని విధంగా.. ఒక రకంగా చెప్పాలంటే జగన్ కూడా ఊహించని ఘన విజయం వైసీపీ సొంతమైంది. అంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని లెక్కగట్టడం ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి సాధ్యం కాలేదు, అదే సమయంలో జగన్ విజయం ఆ స్థాయిలో ఉంటుందని సాక్షి కూడా ఊహించలేకపోయింది. ఒకరకంగా టీడీపీ అతి విశ్వాసమే ఆ పార్టీని ముంచింది.
తప్పులు గుర్తించకపోతే అంతే..
పార్టీ ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు తప్పులు సరిగా కనపడవు, ప్రతిపక్షాలు కూడా కంటికి ఆనవు. 2019లో టీడీపీ చేసిన తప్పు అదే. జగన్ పాదయాత్ర అంత బ్రహ్మాండంగా జరుగుతున్నా.. చంద్రబాబు పట్టించుకోలేదు.
కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తల్నే నమ్మారు. తన గెలుపు గ్యారెంటీ అని ఊదరగొట్టడంతో బాబు భ్రమల్లో పడిపోయారు. చివరకు 23 సీట్లతో ఘోర పరాభవం చవిచూశారు.
ప్రస్తుతం జరుగుతున్న సీన్..
ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. టీడీపీలో ఉన్న లోపాల్ని పచ్చ మీడియా ఎత్తిచూపడం లేదు. బాబు అనుసరిస్తున్న పాతకాలం నాటి పద్ధతుల్ని, ఆయన చేస్తున్న కొన్ని వ్యూహాత్మక తప్పిదాల్ని చెప్పడం లేదు. కేవలం బాబు గెలుపు ఖాయం అనే హెడ్డింగులు మాత్రమే పెడుతూ.. 40 ఇయర్స్ ఇండస్ట్రీని మరోసారి తప్పుదోవ పట్టిస్తోంది.
నిజమైన శ్రేయోభిలాషి ఎప్పుడైనా తప్పుల్ని కూడా ఎంచాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. బాబు మీడియా మాత్రం ఆ పని చేయడం లేదు. పరోక్షంగా ఆయనకు రాజకీయంగా ఎంత కీడు చేయాలో అదంతా చేస్తున్నట్టు కనిపిస్తోంది. పైకి బాబును పొగుడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, అదెంత కీడు చేస్తుందో గ్రహించడం లేదు.
ఇప్పుడు కూడా చంద్రబాబుకి లేనిపోని ఎలివేషన్లు ఇస్తూ.. వైసీపీపై లేని వ్యతిరేకతను చూపిస్తోంది ఎల్లో మీడియా. దీని ప్రభావం ఇంకెంత దారుణంగా ఉంటుందో చూడాలి.