అవమానాలతో బయటకు వెళ్లిపోయిన టీడీపీ నాయకురాళ్లు

రాజకీయ పార్టీల్లో వివిధ రంగాల్లో అంతో ఇంతో పేరున్నవారు చేరడం, యేవో కారణాలతో బయటకు వెళ్లిపోవడం చాలా మామూలు విషయం. కొందరు ఈ రాజకీయాలు మనకెందుకులే అని విరమించుకుంటే, కొందరు ఇతర పార్టీల్లో చేరుతారు.…

రాజకీయ పార్టీల్లో వివిధ రంగాల్లో అంతో ఇంతో పేరున్నవారు చేరడం, యేవో కారణాలతో బయటకు వెళ్లిపోవడం చాలా మామూలు విషయం. కొందరు ఈ రాజకీయాలు మనకెందుకులే అని విరమించుకుంటే, కొందరు ఇతర పార్టీల్లో చేరుతారు. సినిమా నటీ నటులకు, హీరో హీరోయిన్లకు రాజకీయాలు సీరియస్ వ్యవహారం కాదు. ఆ రంగంలో ఇమేజ్ తగ్గిపోగానే లేదా అవకాశాలు లేకుండా పోగానే సహజంగా వారు దృష్టి రాజకీయాలవైపు మళ్లుతుంది.

సినిమా రంగంలో బ్రహ్మాండమైన ఇమేజ్ ఉన్నవారు కూడా పెద్ద పెద్ద ఆశలతో రాజకీయ రంగంలోకి వస్తారు. వీరిలో కొందరు రాణిస్తారు. కొందరు కనుమరుగైపోతారు. 

ఇప్పుడున్న పార్టీల్లో చెప్పుకోదగ్గ పార్టీ టీడీపీ. దాంట్లో ఎన్నో ఆశలతో చేరిన అనేకమంది నాయకురాళ్లు తమకు పార్టీలో ప్రాధాన్యం లేదని, గుర్తింపు లేదని, అవమానించారని ఏడ్చుకుంటూ పార్టీ నుంచి వెళ్ళిపోయినా సందర్భాలు అనేకమున్నాయి. అనేక పార్టీల్లో ఇలా జరుగుతూ ఉందనుకోండి.

కానీ టీడీపీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి దాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఆనాడు ఎన్టీఆర్ హయాంలో రేణుకా చౌదరి దగ్గరి నుంచి లేటెస్టుగా దివ్యవాణి వరకు తమకు అవమానం  జరిగిందంటూ ఏడ్చుకుంటూ బయటకు వెళ్లినవారే. రేణుకా చౌదరి కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రిగా ఎదిగారు. ఆ పార్టీలో కీలక నాయకురాలు అయ్యారు.

ఒకప్పటి అందాల హీరోయిన్ జయప్రద టీడీపీ నుంచి వెళ్ళిపోయి ఉత్తరప్రదేశ్ కు వలసపోయింది.

తెలుగు రాజకీయాలను వదిలేసి యూపీలో రాంపూర్ నుంచి సమాజ్ వాదీ పార్టీ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచింది. ఆ తరువాత విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరింది. పార్టీ అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేస్తానని చెబుతోంది. ఒకప్పుడు టీడీపీలో గ్లామరస్ అధికార ప్రతినిధిగా వెలిగిపోయిన సాధినేని యామినీ శర్మ పార్టీలో తనకు గుర్తింపు లేదని ఆరోపిస్తూ బీజేపీలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు మాజీ హీరోయిన్ కవిత (స్టార్ హోరోయిన్ ఏమీ కాదు ) తనకు అవమానం జరిగిందని కంట తడి పెట్టుకుంటూ పార్టీని వదిలి వెళ్ళిపోయింది. 

కుటుంబ సమస్యల కారణంగా రాజకీయాలకే స్వస్తి చెప్పింది.

ఇక ఒకప్పుడు టీడీపీలో, ఆ తరువాత వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్న ఒకప్పటి టాప్ హీరోయిన్ రోజా కూడా అనేక అవమానాలతో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ లో చేరి, ఆ తరువాత జగన్ పార్టీలోకి వెళ్ళింది. టీడీపీలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన రోజా వైసీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. మంత్రి పదవి కొట్టేసింది. ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ హీరోయిన్, సహజ నటిగా పేరున్న జయసుధ కూడా టీడీపీలో ఎక్కువకాలం నిలదొక్కుకోలేక పోయింది. ఆ తరువాత వైసీపీ లో చేరినా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంది. 

ఇక టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన దివ్య వాణి ఎట్టకేలకు టీడీపీకి రాజీనామా చేసింది. ఈమెది కూడా అందరిలాంటి కథే. పార్టీలో తనకు ప్రాధాన్యం లేదని, మహానాడులో సైతం మాట్లాడనివ్వలేదని ఆరోపించింది. కంట నీరు పెట్టుకుంది.

ఆమె నెక్ట్స్ స్టెప్ ఏంటీ అనే చర్చ జరుగుతోంది. వైసీపీ వైపు వెళ్లే అవకాశాలు తక్కువే.. ఆమె బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ పెద్దలతో ఆమె చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తొందరలోనే దివ్యవాణి బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని దివ్యవాణి రాజీనామాస్త్రం సంధించింది . ఆ వెంటనే వెనక్కి తీసుకుంది. కానీ మరోసారి రిజైన్ చేసింది. అంతకుముందు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడారు. దీంతో రాజీనామాపై దివ్యవాణి వెనక్కి తగ్గింది. కానీ ఫలితం లేదు. టీడీపీలో గుర్తింపు దక్కడం లేదని, పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని చెప్పింది. ఈమె సినిమా రంగంలో టాప్ హీరోయిన్ కాదుగానీ పెళ్లి పుస్తకం సినిమాతో బాపు బొమ్మ అనే గుర్తింపు తెచ్చుకుంది.