వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీపై బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు. వైఎస్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన డీకే అరుణ, ఆయన కుటుంబానికి ఆప్తురాలిగా గుర్తింపు పొందారు.
తెలంగాణలో వైఎస్సార్ తనయ షర్మిల పార్టీ ప్రభావం ఎలా వుంటుందనే మీడియా ప్రతినిధుల ప్రశ్నపై డీకే అరుణ సీరియస్ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఏమీ వుండదన్నారు. కుటుంబ సభ్యులతో విభేదాల వల్ల షర్మిల తెలంగాణ వచ్చి పార్టీ పెట్టారన్నారు. ఆంధ్రా పాలకుల వివక్షకు గురయ్యామని, స్వయం పాలన సాధించుకోవాలనే సెంటిమెంట్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు సాధించుకున్నారన్నారు.
వైఎస్ షర్మిల తెలంగాణ కోసం ఎప్పుడూ పట్టు పట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని ఆమె ఎప్పుడూ కోరలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఆడపడుచు, కోడలు అంటూ ఇక్కడ పోటీకి సిద్ధమైందన్నారు. తెలంగాణలో ఎవరికైనా అధికారం ఇస్తామనే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ఆంధ్రా వివక్షకు గురై తెలంగాణను ప్రజలు సాధించుకున్నారన్నారు.
తెలంగాణ సెంటిమెంట్ ఉన్నంత వరకూ షర్మిల లేదా ఆంధ్రా నాయకులు ఎవరిచ్చి పార్టీ పెట్టినా ఆదరించే పరిస్థితి వుండదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆమె ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం అంత ఈజీ కాదని డీకే అరుణ తేల్చి చెప్పారు.