సమైక్యవాదం ఇంకా ఉందని గుత్తా నమ్ముతున్నారా?

టీఆర్ఎస్ నాయకులు తెలంగాణా సెంటిమెంటును అప్పుడప్పుడూ రగిలిస్తూనే ఉంటారు. అలా చేయకపోతే గులాబీ పార్టీకి మనుగడ ఉండదని వీరు భావిస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అయిపొయింది. కానీ తెలంగాణలో ఇంకా సమైక్యవాదులు ఉన్నారని,…

టీఆర్ఎస్ నాయకులు తెలంగాణా సెంటిమెంటును అప్పుడప్పుడూ రగిలిస్తూనే ఉంటారు. అలా చేయకపోతే గులాబీ పార్టీకి మనుగడ ఉండదని వీరు భావిస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అయిపొయింది. కానీ తెలంగాణలో ఇంకా సమైక్యవాదులు ఉన్నారని, వారు రాష్ట్రాన్ని కబ్జా చేస్తారని, మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటారని ఇప్పటికీ అంటుంటారు. ఈ మాట భయంతో అంటారో, తెలంగాణా సెంటిమెంటును సజీవంగా ఉంచాలని అంటారో తెలియదు. వాస్తవానికి ఈ మాటకు అర్ధం లేదు. 

బ్రిటిషు వారు ఇండియా నుంచి వెళ్ళిపోయి 75 ఏళ్ళు గడిచిపోయాయి. వారు మళ్ళీ వచ్చి ఇండియాను ఆక్రమించగలరా? రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అయ్యాక మళ్ళీ సమైక్యవాదం ఎందుకు తలెత్తుతుంది? రాష్ట్ర విభజన జరిగినప్పుడు సమైక్యవాద ఉద్యమం జరిగిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు ఆంధ్రావారికి ఆ బాధలేదు. ఆ బాధను ఎప్పుడో మర్చిపోయారు. మళ్ళీ తెలంగాణాను ఆక్రమించుకోవాలని వారు ప్రయత్నాలు చేయడంలేదు.

తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ పై సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని, సంవత్సర కాలంగా ఆ పరిణామాలను చూస్తున్నామని అన్నారు. అసలు గుత్తా మాటలకు అర్ధం ఉందా? సమైక్యవాదులు కుట్రలు చేయడం ఏమిటి? తెలంగాణలో ఉన్న ఆంధ్రులు (గుత్తా దృష్టిలో సమైక్యవాదులు) అంటే సామాన్య ప్రజలు, రాజకీయ నాయకులు కూడా తెలంగాణా ఏర్పడగానే టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు దాసోహం అన్నారు. జంటనగరాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు ఆంధ్రా మూలాలున్న ఎమ్మెల్యేలు  ఉన్నారు కదా. చాలామంది ఆంధ్రా రాజకీయ నాయకులను, పారిశ్రామికవేత్తలను, బడా వ్యాపారులను, కాంట్రాక్టర్లను కేసీఆర్ అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు కదా. ఇంకా సమైక్యవాదులు ఎక్కడ ఉన్నారు? గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి అన్నది ఇప్పుడు చర్చకు కారణమవుతుంది. 

తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టడానికి, కేసీఆర్ ని అప్రతిష్టపాలు చేయడానికి సమైక్యవాదులు కుట్రలకు పాల్పడుతున్నారని  ఆరోపణలు చేశారు. గుత్తా చెప్పినట్లు సమైక్యవాదులు ఉన్నారని అనుకున్న వారు కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బ తీయగలరా? మానసికంగా దెబ్బ కొట్టగలరా? కేసీఆర్ అంత బలహీనుడా? గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు, కేసీఆర్ కుటుంబం పై జరుగుతున్న కుట్రలు, తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తీరు, వైయస్ షర్మిల పాదయాత్ర, బండి సంజయ్ పాదయాత్ర, తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్ష వంటి అంశాలను ప్రస్తావించిన ఆయన ఈ పరిణామాలన్నింటినీ చూస్తే కేసీఆర్ ను దెబ్బ తీయడం కోసం జరుగుతున్న కుట్రగా కనిపిస్తోందన్నారు.

ఏపీలో చేతకాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ కబ్జా చేయడానికి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయని, అనిశ్చిత వాతావరణం ఉందని పేర్కొన్న ఆయన తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇంత కాలం అయిన తర్వాత కూడా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ నమ్ముతోందా? సెంటిమెంట్ అస్త్రంతో టీఆర్ఎస్ పార్టీ షర్మిలను దెబ్బతీయాలని ప్లాన్ చేస్తుందా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది. గుత్తా కూడా షర్మిలను దృష్టిలో పెట్టుకొనే కామెంట్స్ చేశారు.  వైఎస్ షర్మిలను ఆంధ్ర పేరుతో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు.

నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిలకు పులివెందులలో ఓటు హక్కు ఉందని, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల పని చేసిందని, సోదరుడు పదవి ఇవ్వకపోవడంతో, ఇప్పుడు తెలంగాణలో షర్మిల తాను తెలంగాణ కోడలినని కొత్త రాగం అందుకుందని టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత కూడా ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల స్థానికతను టార్గెట్ చేశారు. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు నేడు తెలంగాణ రూటు .. మీరు కమలం కోవర్టు.. ఆరేంజ్ ప్యారేట్టు అంటూ టార్గెట్ చేసిన కవిత వైఎస్ షర్మిలను పొలిటికల్ టూరిస్ట్ అంటూ విమర్శించారు. 

ఇక వైయస్ షర్మిల ఈ వ్యవహారంపై డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాను తెలంగాణ కోడలిని, తాను ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నా అని, ఇక్కడి వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నానని, తన గతం తన భవిష్యత్తు మొత్తం తెలంగాణలోనే అని వైయస్ షర్మిల పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించిన వైయస్ఆర్ బిడ్డ ను తెలంగాణ రాష్ట్రం ఎలా ఆదరిస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. 

ఒక రకంగా చెప్పాలంటే వైయస్ షర్మిల ను ఆంధ్ర పేరుతో టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలలో కూడా వైయస్ షర్మిల పట్ల వ్యతిరేకతను కలిగించటంలో భాగంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటును మరోసారి రాజేస్తున్నారు. దాన్నే సమైక్యవాదం అంటున్నారు.