విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి అక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి. ప్రధానంగా విశాఖలో భూముల అన్యాక్రాంతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నాడు టీడీపీ హయాంలో భారీగా భూఆక్రమణలు జరిగాయి. వాటి నిగ్గు తేల్చేందుకు సిట్ పేరుతో నాటకాలు ఆడడం తప్ప, ఒరిగిందేమీ లేదు. చంద్రబాబు ప్రభుత్వం పోయి, జగన్ సర్కార్ వచ్చినా విశాఖలో భూఆక్రమణలు మాత్రం కొనసాగుతూనే వున్నాయి.
అధికారం మారిందే తప్ప, విశాఖలో భూఆక్రమణల పర్వానికి తెరపడలేదు. ఈ నేపథ్యంలో విశాఖలో భూఆక్రమణలపై విచారణ పేరుతో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. ఈ అంశాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు నెత్తికెత్తుకోవడం గమనార్హం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో భూములను పెద్ద సంఖ్యలో కొట్టేస్తున్నారని విమర్శించారు. టీడీపీ, వైసీపీల మధ్య వ్యవహారాన్ని భూదొంగల ఎలయన్స్‌గా ఆయన అభివర్ణించారు.
బాబు హయాంలో, అలాగే ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్ రెండు నివేదికలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ భూకుంభకోణాలపై చర్చిస్తామని ఆయన ప్రకటించారు. రాజకీయ రాబంధులే భూదొంగలుగా మారారని ఆయన ఘాటు విమర్శ చేశారు.
ఇదిలా వుండగా పోలవరం ప్రాజెక్ట్‌పై ఆయన మాట్లాడారు. పోలవరం నిర్మిస్తామని కేంద్రం చెబితే..తామే నిర్మిస్తామని చంద్రబాబు తీసుకున్నారని మరోసారి గుర్తు చేశారు. పోలవరం ఆలస్యానికి నాడు చంద్రబాబు, నేడు జగన్ సర్కార్లే కారణమని ఆయన విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరంపై తాము బాహుబలిగా వైసీపీ అభివర్ణించుకుంటోందని వెటకరించారు. మిగిలిన పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో పిల్లిగా మారిపోతోందన్నారు.
వైసీపీ, బీజేపీ మధ్య రాజ్యాంగ బద్ధమైన సంబంధాలే తప్ప మరే బంధాలు లేవని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రత్యామ్నాయంగా బీజేపీ, జనసేనలే నిలబడతాయని ఆయన చెప్పుకొచ్చారు.