Advertisement

Advertisement


Home > Movies - Reviews

HIT 2 Review: మూవీ రివ్యూ: హిట్2

HIT 2 Review: మూవీ రివ్యూ: హిట్2

టైటిల్: హిట్2
రేటింగ్: 3/5
తారాగణం: అడివి శేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసద్, సుహాస్, హర్షవర్ధన్, రావు రమేష్ తదితరులు
సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి, జాన్ స్టీవర్ట్ ఏడురి
కెమెరా: ఎస్. మణికందన్
ఎడిటర్: గ్యారీ 
నిర్మాత: ప్రశాంతి తిరినేని 
రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022

ఆ మధ్యన విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' కి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో హిట్2 గా అదే జానర్లో ఇంకొకటి విడుదలయింది. హిట్ కి ఉన్న హిట్ ట్రాక్ రికార్డ్ వల్ల, అడివి శేష్ సినిమాలపై ఉన్న నమ్మకం వల్ల హిట్2 కి కూడా క్రేజ్ బిల్డయింది.

ఇంతకీ కథాకథనాలు ఎలా ఉన్నాయో, క్రేజుకి తగ్గ కంటెంట్ ఉందో లేదో చూద్దాం. 

కేడీ ఒక పోలీస్ ఆఫీసర్. వైజాగులో హత్యానేరపరిశోధన విభాగంలో పని చేస్తుంటాడు. అతనికొక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఇదిలా ఉంటే సంజన అనే ఒక పబ్ ఉద్యోగిని దారుణంగా చంపబడుతుంది. ఆ హత్య ఎవరు చేసారన్నది మన హీరో కేడీ చేధించాల్సిన విషయం. 

సాధారణంగా ఏ క్రైం థ్రిల్లర్ సినిమాలో అయినా వ్యవహారం ఇలానే ఉంటుంది. అయినప్పటికీ సగటు ప్రేక్షకుడికి క్లూ అందకుండా కథ నడపడం, పలువురి మీద అనుమానాలు వచ్చేలా కథనం ఉండడం "అవే కళ్లు" నాటి నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పటికప్పుడు కొత్త కథలతో ఇటువంటి ఉత్కంఠభరితమైన సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అటువంటివాటిలో ఒక మేలురకం చిత్రం ఇది. 

ఈ చిత్రానికి ఆయువుపట్టు జాన్ స్టీవర్ట్ అందించిన నేపధ్యసంగీతం. ఆద్యంతం ఆసక్తికరంగా కూర్చోపెట్టింది. ఎం.ఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి స్వరపరిచిన పాటలు మాత్రం విడిగా బాగానే ఉన్నా ఈ జానర్ కి పెద్దగా అవసరం లేనివి. కెమెరా వర్క్ బ్రిలియంట్ గా ఉంది. ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. 

ఎక్కడా డ్రాప్ లేకుండా క్లైమాక్స్ లో హంతకుడిని పట్టుకోవడం వరకు గ్రిప్పింగ్ గా నడపడం మెచ్చుకోదగ్గ అంశం.

అయితే అక్కడక్కడ కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి. రావురమేష్ పాత్రని మరింత బలంగా చెక్కుండాల్సింది. అలాగే హీరోయిన్ తల్లి పాత్ర కూడా పెద్దగా పర్పస్ లేకుండా కుదించేసినట్టయింది. ఏ ఇంట్లోకి వెళ్లినా చీకట్లో ఒక చేత్తో టార్చ్ లైట్, ఒక చేత్తో పిస్టల్ పట్టుకుని వెతకడం కాస్త రిపిటిటివ్ గా అనిపిస్తుంది. అలాగే మరీ శరీరభాగాలు తెగ్గొట్టడం లాంటి సన్నివేశాలు బ్రూటల్ గా ఉన్నాయి. ఆ తరహా సన్నివేశాలు చూడలేని వాళ్లు ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. 

మంచి గ్రిప్పింగ్ కథని ఇంకాసేపు ఉన్నా బానే ఉంటుంది అన్నప్పుడే ముగించడం, అడివి శేష్ స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వగైరాలు ప్లస్సులనుకుంటే ఔటాఫ్ ద బాక్స్ ఎలిమెంట్స్ ఏవీ లేకపోవడం మైనస్. ఆ విషయంలో కూడా ప్రూవ్ చేసుకుని ఉండుంటే మరింత గొప్ప సినిమా అయ్యుండేది. 

ఫస్టాఫ్ ఉత్కంఠగా సాగి ఇంటర్వల్ బ్యాంగ్ ట్విస్ట్ తో ముగిసింది. ద్వీతీయార్థం మరింత పట్టుతో సాగడం ఇక్కడ విశేషం. సినిమాకి సెకండాఫే కీలకం. అది ఇక్కడ వర్కౌట్ కావడం ప్లస్సయింది. 

ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అడివి శేష్ నటన మెచ్చుకునే విధంగా ఉంది. ఫిట్నెస్ గానీ, చిన్న చిన్న ఫైట్స్ చేసిన విధానం గానీ పాత్రకి తగ్గట్టున్నాయి. 

మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కి డెప్త్ లేదు. ఉండాలి కాబట్టి ఉన్నట్టుంది. కోమలీ ప్రసాద్ అడివి శేష్ అసిస్టెంట్ గా బాగుంది. సుహాస్ మెప్పించాడు. 

హర్షవర్ధన్, శ్రీకాంత్ అయంగర్ లాంటి వాళ్లు ఉన్నా వాళ్లు చిన్న క్యారెక్టర్స్ కి పరిమితమయ్యారు. 

ఓవరాల్ గా ఇది థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవాళ్లు చూడదగ్గ చిత్రం. చిన్న చిన్న లోటుపాట్లున్నా, బెటర్ గా ఉండడానికి స్కోప్ ఇంకా ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉత్కంఠభరితంగా సాగింది హిట్2. ఆలాగే హిట్ 3 కోసం వేచి చూసేలాగ ఎండ్ సీన్ ముగిసింది. 

బాటం లైన్: బాగుంది

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా