టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (ఆర్కే) క్లాస్ పీకారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కర్నూలు పర్యటనలో తనకివే చివరి ఎన్నికలని చంద్రబాబు ప్రకటించడంతో రామోజీ, ఆర్కే దిక్కుతోచక తలలు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబుపై సెటైర్స్ విసిరారు.
మనసులో మాటను చంద్రబాబు మరోసారి చెప్పారన్నారు. 2024లో తనకు అధికారం ఇవ్వకపోతే, చివరి ఎన్నికలని బాబు ప్రకటించడంపై రామోజీ, రాధాకృష్ణ తలకాయలు పట్టుకున్నారన్నారు. ఈయనెవర్రా బాబు… జాకీలు పెట్టి లేపుతుంటే, ఎంతకీ లేగట్లేదని వారు అనుకుంటున్నారన్నారు. అన్ని మూసేసుకుని ఇంటికి పోతానంటాడేంటి? అని వాళ్లిద్దరూ తెగ బాధపడిపోతున్నారని చెప్పుకొచ్చారు.
దీంతో మళ్లీ చంద్రబాబుని పిలిపించుకుని క్లాస్ పీకారని అన్నారు. ప్రజలకు చివరి ఎన్నికలని చెప్పాలని, నీకు కాదు అని బాబుకు వాళ్లిద్దరు క్లాస్ పీకారన్నారు. దీంతో ఆయన పోలవరం వెళ్లి యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. మీకు ఓటు వేయడానికి చివరి అవకాశం ఇస్తున్నానని చంద్రబాబు ప్రజలకు చెబుతున్నారని పేర్ని నాని అన్నారు.
రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు కలిసి ప్రజలకు ఓటు వేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నారని దెప్పి పొడిచారు. వెనుకటికి కొంత మంది డూప్లికేట్ స్వామీజీలు వుండేవారన్నారు. వాళ్లు ఇంటికొస్తే ఒక రేటు, కాళ్లు కడిగి, పూజ చేసి, నెత్తిన నీళ్లు చల్లుకుంటే మరో రేటు అని స్వామిజీలు టికెట్లు పెట్టేవారని వెటకరించారు. కాళ్లు కడిగి సేవ చేసుకున్నందుకు ఎదురు డబ్బు ఇవ్వాల్సి వుంటుందన్నారు. ఆ డూప్లికేట్ స్వామీజీల మాదిరిగా చంద్రబాబు కూడా తయారయ్యారని ఎద్దేవా చేశారు.
ఓటు మనం వేయాలి, ఆయనకు అధికారం కావాలి, దానికి ఇదే చివరి అవకాశం అట అని వెటకరించారు. ఏం తంతు అయ్యా చంద్రబాబునాయుడు? మీ ముగ్గురి తంతు చూస్తుంటే యమ గొప్పగా వుందని ఆయన అన్నారు. ప్రజలకు ఓటు వేయడానికి మీరు చివరి అవకాశం ఇస్తున్నారన్నారు. అసలు మీకు మైండ్ వుందా? లేదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. టీవీల్లో చంద్రబాబును చూస్తూ ఇదేం ఖర్మరా బాబూ అని జనం బాధపడుతున్నారన్నారు.