తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఉనికి చాటుకుంటోంది. ఈ క్రమంలో షర్మిల సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ నేతలు అయిష్టంగానైనా షర్మిల విమర్శలకు సమాధానం ఇవ్వడంతో పాటు ప్రతి విమర్శలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదే అదునుగా షర్మిల మరింత దూసుకుపోతున్నారు. తాను తెలంగాణ బిడ్డ అని చాటి చెప్పుకునేందుకు ఆమె బాగా శ్రమించాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో షర్మిల సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని వున్నాయని తెలంగాణ అధికార పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు. షర్మిల మాటల్నే తీసుకుని, మరి దీనికి ఏం సమాధానాలు చెబుతావమ్మా? అని నిలదీస్తున్నారు.
‘నేను ఆంధ్రా వ్యక్తినంటూ పదేపదే విమర్శిస్తున్నారు. ఆంధ్రా పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి మంత్రి కేటీఆర్ భార్య ఆంధ్రా నుంచి రాలేదా? ఇక్కడ బతకడం లేదా? కేటీఆర్ భార్యను గౌరవించినప్పుడు.. నన్ను ఎందుకు గౌరవించరు. మీకో న్యాయం.. మాకో న్యాయమా? ఇదెక్కడి న్యాయమని అడుగుతున్నా. నేను ఇక్కడే పెరిగాను.. ఇక్కడే చదివాను.. ఇక్కడే పెళ్లి చేసుకున్నాను.. ఇక్కడే కొడుకును, బిడ్డను కన్నా. నా గతం ఇక్కడే… నా భవిష్యత్తూ ఇక్కడే. ఆడబిడ్డను ‘ఆడ’పిల్ల అంటారు. భార్యను మా ఆవిడ అంటారు’ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ నేటివిటీని చెప్పే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
ఆంధ్రా పిల్ల…తెలంగాణ ‘ఆడ’పిల్ల అయినప్పుడు …పేరుకు ముందు ‘వైఎస్’ ఎందుకమ్మా? అని టీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు నిలదీస్తున్నారు. భర్త అనిల్ ఇంటి పేరు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అనిల్ పేరుకు ముందు వైఎస్ అని పెట్టకపోయారా? అని వెటకరిస్తున్నారు. ప్రజల్లో పరపతి కోసం పుట్టింటి ఇంటి పేరు, రాజకీయ ఉనికి కోసం మెట్టినిల్లు కావాల్సి వచ్చిందా షర్మిలా? అని నెటిజన్లు నిలదీయడం గమనార్హం.
టీఆర్ఎస్ సోషల్ మీడియాకు దీటుగా షర్మిల తరపు వారు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. కేసీఆర్ తనయ కవిత ఇంటి ముందు కల్వకుంట్ల కాకుండా, ఆమె భర్త ఇంటి పేరు ఎందుకు లేదని నిలదీస్తున్నారు. షర్మిలకు సంధించిన ప్రశ్నలనే తిరిగి కవితకు సంధించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. తండ్రి అధికారంలోనే కాదు, జీవించి లేని కాలంలో తమ నాయకురాలు రాజకీయాల్లో సత్తా ఏంటో చూపడానికి వచ్చారని షర్మిల అనుచరులు దీటుగా సమాధానం ఇస్తున్నారు. కానీ కవిత తండ్రి ఏలుబడిలో ఉండగా నిజామాబాద్‌లో ఓడిపోయారని గుర్తు చేస్తూ… ముందు స్వతంత్ర రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని హితవు చెబుతున్నారు.