ఏ రాజకీయ పార్టీ అయినా డెవలప్ కావాలంటే కొత్తగా చేరేవారికంటే ఫిరాయింపుదారులకే ప్రాధాన్యం ఇస్తుంది. ఆల్రెడీ నాయకులుగా ఎస్టాబ్లిష్ అయినవారికే గాలం వేయాలని ప్రయత్నిస్తారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారిని చేర్చుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలు అంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జంప్ జిలానీల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అధికార టీఆర్ఎస్ కూడా ఇతర పార్టీల నుంచి నేతలను లాగడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీజేపీకి, కాంగ్రెస్ కు ఎలాగూ తప్పదు. ఆ రెండు పార్టీలు పూర్తిగా చేరికల మీదనే దృష్టి పెట్టాయి. రెండు పార్టీలు చేరికల కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానా రెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసుకోగా, బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అధ్యక్షతన కమిటీ వేసింది.
కాంగ్రెస్ లో పేరుకే జానారెడ్డి ఆధ్వర్యంలో చేరికల కమిటీ ఉంది. కానీ పార్టీలో చేరాలనుకున్నావారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే కలుస్తున్నారు. ఇక బీజేపీలో నాయకత్వం ఈటలకు ఒక టార్గెట్ పెట్టిందట. ఏమిటది? టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి నలభై మంది నాయకులను బీజేపీలో చేర్పించాలి.
ఈటలకు ఈ బాధ్యతలు అప్పగించి ఇప్పటికి మూడు వారాలు గడుస్తున్నా.. ఒక్కరు కూడా చేరలేదు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ఎప్పటికప్పుడు కొత్త నాయకులను పార్టీలోకి తేవాలనే ఒత్తిడి ఈటలపై పెరిగింది. ఇప్పటికీ ఒక్కరిని కూడా చేర్పించలేదనే విమర్శలు కూడా స్టార్ట్ అయ్యాయి. దీంతో ఈటల తల పట్టుకుంటున్నాడట.
నాయకులు చేరడం అంత సులభం కాదు కదా. అందులోనూ ఆషాఢ మాసం కారణంగా పార్టీలోకి కొత్తగా ఎవరు చేరడం లేదని.. ముహూర్తాలు ప్రారంభం అయ్యాక వలసలు పెరుగుతాయని ఈటల కవర్ చేసుకుంటున్నారు. జూలై 27 తర్వాత భారీ చేరికలు ఉంటాయని ఈటల ఈ మధ్యనే చెప్పాడు. అయితే బీజేపీలో చేరే ఆ నాయకులు ఎవరనేది మాత్రం తేలడం లేదు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరతాడని ప్రచారం జరిగింది.
ఈ సంగతి తెలియడంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన్ని పార్టీ మారకుండా మేనేజ్ చేసింది. ఇది ఈటల వైఫల్యంగా బీజేపీ నాయకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ తమ నాయకులను లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ఆ రెండు పార్టీలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయట. మరి ఈటల తన టార్గెట్ ను ఎంతవరకు పూర్తి చేస్తారో చెప్పలేం.