తుమ్మ‌ల‌ను మా పార్టీలోకి ఆహ్వానిస్తాం

తెలంగాణ రాజ‌కీయాల్లో అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులేస్తున్నాయి. ఇప్ప‌టికే బీఆర్ఎస్ త‌న అభ్య‌ర్థుల జాబితాను ఎంతో ముందుగా ప్ర‌క‌టించి ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసిరింది. బీజేపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా వుండ‌గా, కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ…

తెలంగాణ రాజ‌కీయాల్లో అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులేస్తున్నాయి. ఇప్ప‌టికే బీఆర్ఎస్ త‌న అభ్య‌ర్థుల జాబితాను ఎంతో ముందుగా ప్ర‌క‌టించి ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసిరింది. బీజేపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా వుండ‌గా, కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లో టికెట్లు ద‌క్క‌ని, ద‌క్క‌వ‌ని భావిస్తున్న నేత‌లు మాత్ర‌మే బీజేపీ వైపు చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌ల కాలంలో బీజేపీలోకి వ‌ల‌స‌లు త‌గ్గిపోయాయి. నాయ‌కుల కోసం తెలంగాణ బీజేపీ ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్‌లో టికెట్ ద‌క్క‌ని మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు గాలం వేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. బీజేపీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడుతూ తుమ్మ‌ల‌ను త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తామ‌న్నారు. పాలేరు టికెట్ ద‌క్క‌ని తుమ్మ‌ల‌తో అక్క‌డి నుంచి బ‌రిలో దించ‌డంపై ఆయ‌న‌తో చర్చిస్తామ‌న్నారు.

తుమ్మలను అవసరానికి వాడుకుని వదిలేశారని ఈట‌ల విమ‌ర్శించారు. ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ బ‌లంగా వుంది. అక్క‌డ పాగా వేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి చేరిక‌తో ఖ‌మ్మంలో కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌ప‌డింది. తుమ్మ‌ల అనుచ‌రులు మాత్రం కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేయాల‌ని ఆయ‌న‌పై ఒత్తిడి చేస్తున్నారు. తుమ్మ‌ల మాత్రం వేచి చూసే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తుంద‌నే ఆలోచ‌నే తుమ్మ‌ల కీల‌క నిర్ణ‌యం తీసుకోడానికి అడ్డంకిగా మారిందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.  

త‌న అనుచ‌రుల అభిప్రాయాన్ని గౌర‌వించి తుమ్మ‌ల కాంగ్రెస్‌లో చేరుతారా? లేక బీజేపీ ఆహ్వానాన్ని మ‌న్నించి కాషాయ కండువా క‌ప్పుకుంటారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఖ‌మ్మంలో రాజ‌కీయం రోజురోజుకూ వేడెక్కుతోంది.