ఓ హీరోకి అడిగినంతా రెమ్యూనిరేషన్ ఎందుకు ఇస్తారు. మాంచి ఓపెనింగ్ వస్తుంది. సినిమా యావరేజ్ టాక్ వచ్చినా ముందుకు లాక్కు వెళ్లిపోతాడు. ఇలాంటి క్వాలిఫికేషన్లు అన్నీ చూసే ఇస్తారు. గత చాలా కాలంగా మెగా హీరోల మీద వున్న భరోసా అదే. మెగా ఫ్యాన్స్ కావచ్చు. మరే రకమైన ఫ్యాన్స్ కావచ్చు. చాలా మంది వున్నారు. అందువల్ల సినిమా యావరేజ్ అయినా డబ్బులు వచ్చేస్తాయి అనే భరోసా వుండేది.
కానీ రాను రాను ఒక్కో మెగా హీరో మీద ఈ భరోసా సడలిపోతోంది. ఓపెనింగ్ లు వుడడం లేదు. సినిమాలు నిల్చోవడం లేదు. పోనీ ఏదో ఒక సినిమా తేడా జరిగింది అని సరిపెట్టుకోవడానికి కూడా లేకుండా వుంది. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు స్టార్ట్ చేసిన తరువాత బయ్యర్లు ఫుల్ గా డబ్బులు చేసుకున్న సినిమా ఒక్కటీ లేదు. భారీగా రెమ్యూనిరేషన్ తీసుకున్నారని టాక్ వున్న బ్రో సినిమా అయితే దాదాపు అందరు బయ్యర్లు కుదేలయిపోయారు. ఒక్క వైజాగ్ బయ్యర్ నే మూడు కోట్లు నష్టపోయారని టాక్ వుంది.
సరే పవన్ సంగతి పక్కన పెడితే సాయి ధరమ్ తేజ్ సినిమాలు నాన్ థియేటర్ పుణ్యమా అని ఇటీవల కాస్త గట్టెక్కాయి. విరూపాక్ష మినహా మరే సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడింది లేదు. గుడ్. ఓకె అన్న రేంజ్ తప్ప దాటలేదు. అలాంటి సాయిధరమ్ తేజ్ ఇప్పటి వరకు 8 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటూ వచ్చారు. ఇకపై 13 అడుగుతున్నారని టాక్ వుంది.
వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఎఫ్ 2, ఎఫ్3, గద్దలకొండ గణేష్ తప్ప మరో హిట్ ఖాతలో లేదు. పైగా చాలా డిజాస్టర్లు వున్నాయి. మెగా హీరోల్లో సినిమాను అస్సలు గట్టెక్కించలేని హీరో వరుణ్ తేజ్ నే. గాండీవ ధారి సినిమా కు 9 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నారని టాక్ వుంది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ టాక్ వేరుగా వుంది. గాండీవధారి సినిమాకు క్యూబ్ ఖర్చులు కూడా గిట్టు అవుతాయా అంటే సందేహమే అని ఓ బయ్యర్ అన్నారు.
ఓపెనింగ్ తీసుకురాలేకపోయారు. సినిమాను కాస్తయినా నిలబెట్టలేకపోయారు. మినిమమ్ కలెక్షన్లు లేవు. మరి అలాంటిది అంతంత రెమ్యూనిరేషన్లు ఎందుకు ఇస్తున్నారో నిర్మాతలకే తెలియాలి. తెలుగులో హీరోలు ఎక్కువ మంది అని టాక్ వుంది. కానీ ఇక్కడ ఎక్కువ మంది నిర్మాతలు వున్నారు.
ఒక్కో నిర్మాత ఒకేసారి అరడజను సినిమాలు తీసేయాలన్న తపనతో వుంటున్నారు. దాంతో పోటీలు పడిపోయి హీరోలకు రెమ్యూనిరేషన్లు ఇచ్చేస్తున్నారు. దాంతో వాళ్లు ఇస్తున్నారని వీళ్లు తీసుకుంటున్నారు. కానీ దీని వల్ల నిర్మాతలు..ఆపై బయ్యర్లు కుదేలయిపోతున్నారు. ఇది ఎక్కడకు వెళ్లి ఆగుతుందో?