ఇండస్ట్రీలో సీనియర్-జూనియర్ మధ్య అంతరం ఎప్పుడూ ఉంటూనే ఉంది. అలాంటిది ఓ సీనియర్, ఓ జూనియర్ కలిసి నటించాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులుంటాయి. అనుష్కతో అలాంటి ఇబ్బందినే ఫేస్ చేశానంటున్నాడు నటుడు నవీన్ పొలిశెట్టి.
అనుష్కతో సినిమా అనగానే ఎంత ఎక్సయిట్ అయ్యానో, ఆమెతో పరిచయం పెంచుకునేందుకు అంతే కష్టపడ్డానని తెలిపాడు. తనకు బాగా తెలిసిన పద్ధతిలోనే అనుష్కకు దగ్గరయ్యానంటూ, ఆ విధానాన్ని వెల్లడించాడు.
“అనుష్క దగ్గర సీరియస్ గా ఉండాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. ప్రారంభంలో ఓ 2 రోజులు కొన్ని జోకులు ట్రై చేశాను. 3-4 జోకులు బాగానే పేలాయి. దాంతో అలా సెట్ అయిపోయింది. ఇద్దరం క్లోజ్ అయిపోయాం. ఆ క్లోజ్ నెస్ సినిమాకు బాగా పనిచేసింది. బేసిగ్గా, సినిమా అంతా మా ఇద్దరి క్యారెక్టర్స్ పైనే రన్ అవుతుంది. మేం ఆ కెమిస్ట్రీ చూపించకపోతే కష్టం. ఈ విషయంలో అనుష్కకే క్రెడిట్ ఇవ్వాలి.”
తన మార్క్ జోకులతో అనుష్కకు దగ్గరైన విషయాన్ని నవీన్ బయటపెట్టాడు. కేవలం అనుష్కను మాత్రమే కాకుండా.. యూనిట్ లో చాలామందిని తన జోకులతో పడేశానంటున్న ఈ నటుడు.. అనుష్కను తనను తెరపై చూడడమే పెద్ద ఫీస్ట్ అంటున్నాడు.
“అనుష్కతో నేను కలిసి నటించిన సన్నివేశాల్ని తెరపై చూడాలని బాగా కోరికగా ఉంది. నాకే ఇంతలా అనిపిస్తుందంటే, ఆడియన్స్ కు ఇంకా ఎక్కువ ఆసక్తి ఉంటుందనే విషయం నాకు తెలుసు. అదే మా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.”
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు నవీన్-అనుష్క. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది.