రేవంత్ రెడ్డికి అన్నీ పరీక్షలే

మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తెచ్చిపెట్టినా పరీక్షలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. ఇంకా చెప్పాలంటే టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. మునుగోడు కాంగ్రెస్ స్థానం. ఇక్కడ ఆ పార్టీ గెలవకపోతే…

మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తెచ్చిపెట్టినా పరీక్షలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. ఇంకా చెప్పాలంటే టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. మునుగోడు కాంగ్రెస్ స్థానం. ఇక్కడ ఆ పార్టీ గెలవకపోతే పార్టీ పరువే కాదు, రేవంత్ రెడ్డి పరువు కూడా పోతుంది. అసలే దేశంలో కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ ఆ రాష్ట్రంలోనే దానికి ఆదరణ లేకుండా పోయింది. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణా ప్రజలకు సోనియా గాంధీ  దేవత అని ఆ పార్టీ నాయకులు ఎంత మొత్తుకుంటున్నా ప్రజలు విపించుకోవడంలేదు. 

ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని పార్టీ ఢిల్లీ పెద్దలు అదే పనిగా చెబుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో ఆయనకు పార్టీలో సహకారం కరువైంది. ఇప్పటికీ నాయకులు ఒక తాటిపైకి రావడంలేదు. రేవంత్ రెడ్డిపై ఢిల్లీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, మునుగోడు ఉప ఎన్నికపై గాంధీభవన్ లో పార్టీ కీలక నేత  వేణుగోపాల్ నిర్వహించిన సమావేశం హాట్ హాట్ గా సాగిందని చెబుతున్నారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోకపోతే  మార్చేస్తామని రేవంత్ ను హెచ్చరించారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారన్న ఆయన మునుగోడులో సీరియస్ గా ఎందుకు పనిచేయడం లేదని  నిలదీశారని సమాచారం. ఇంచార్జిలను కలుపుకొని పనిచేయించే బాధ్యత మాణిక్యం ఠాగూర్ తో పాటు రేవంత్ రెడ్డిపైనే ఉందని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారట. ఆ బాధ్యతలు ఎందుకు తీసుకోవడం లేదని  ప్రశ్నించారట. మండల,గ్రామ స్థాయిలో ఇంచార్జిగా ఉన్నవాళ్లు పనిచేయకుంటే మార్చేయాలని ఆదేశించారని చెబుతున్నారు, భారత్ జోడో యాత్ర,మునుగోడు ఉప ఎన్నిక ఒకేసారి ఉన్నాయని.. అసలు ప్రిపరేషనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. 

పబ్లిసిటీ చెయ్యడంలో నువ్వు ఎక్స్పర్టువు కదా … బ్రాండింగ్ చేసుకోవడంలో నువ్వు దిట్ట కదా.. కానీ, భారత్ జోడో యాత్రలో ఎందుకు వెనుక పడ్డావు అంటూ రేవంత్ పై వేణుగోపాల్ సీరియస్ అయ్యారని అంటున్నారు. భారత్ జోడో యాత్ర ప్రచారమే లేదు.. ఎక్కడా హోర్డింగులే లేవు మొత్తం నీ క్యాంపెయినేనా అని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారని తెలుస్తోంది. మునుగోడు ఖర్చు విషయంలో రేవంత్ రెడ్డి చేతులెత్తేశారనే చర్చ సాగుతోంది. పీసీసీ నుంచి రూపాయి కూడా ఇవ్వలేమని, పార్టీ ఫండ్​ రాదంటూ అభ్యర్థి స్రవంతికి తేల్చి చెప్పారని తెలుస్తోంది. 

ఉప ఎన్నికలో భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందనే తాను కృష్ణారెడ్డి పేరు సూచించినా.. సీనియర్లు వ్యతిరేకించారని.. ఇప్పుడు డబ్బులు లేవంటే తానేం చేస్తానని రేవంత్​ రెడ్డి అంటున్నారని సమాచారం. రేవంత్ మూడు గండాలను దాటుకొని పార్టీని విజయతీరాలకు చేర్చాల్సి ఉంది. ఈ మూడింటిలో ఏ ఒక్క దాంట్లో ఆయన విఫలమైనా టీ కాంగ్రెస్ లో ఆయన గురించి చరిత్రగానే చెప్పుకోవాల్సి వస్తుంది. దీంతో రేవంత్ ఒకింత గుబులుగానే ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ కు  ఎదురయ్యే  మూడు గండాలు ఒకటి మునుగోడు ఉప ఎన్నిక, రెండు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు, రాహుల్ భారత్ జోడో పాదయాత్ర. ఈ మూడు అంశాలను విజయవంతం చేయడంపైనే రేవంత్ భవితవ్యం ముడిపడి ఉంది. 

దీంతో ఆయన గత కొద్ది రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతూ వీటిల్లో ఎలా గట్టెక్కాలనే ఆలోచనలో పడిపోయారట. రేవంత్ పార్టీ పగ్గాలు చేపట్టి ఏడాదిపైనే గడిచింది. ఈ పాటికి జిల్లాల్లో సమీక్షలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. అధిష్ఠానం అనుకున్నతంగా పార్టీ గ్రాఫ్ పెరగలేదు. ఎప్పటికప్పుడు ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అనేలా సాగుతోంది రేవంత్ ప్రస్థానం. పార్టీలో సీనియర్ల అసమ్మతిని చల్లార్చడానికే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. వారి అసమ్మతి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగా ఉంది. సీనియర్ల సహకార లేమి.. లోటు బడ్జెట్ కారణంగా రేవంత్ ఉప ఎన్నికలో ముందడుగు వేయలేని పరిస్థతి నెలకొంది. 

దీనికి తోడు ఇపుడు రాహుల్ పాదయాత్ర కూడా చుట్టుకోవడంతో ఎలా దిగ్విజయం చేయాలనే సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. ఇదే నెలలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు ఉండడం.. అందులో పార్టీ ప్రతినిధులను సమన్వయం చేసి సోనియా విధేయుడు మల్లికార్జున ఖర్గేకు ఓట్లు పడేలా చూసుకోవడం మొదటి బాధ్యత. ఆ తర్వాత అతి పెద్ద కార్యక్రమం రాహుల్ పాదయాత్ర. తెలంగాణలో 13 రోజుల పాటు 375 కిలోమీటర్ల యాత్రను ఆద్యంతం దగ్గరుండి చూసుకోవడం.. అన్ని పక్షాల నుండి నేతలను, జనాలను తరలించడం తలకు మించిన భారమే.

ఇదిలా ఉండగానే మునుగోడు ఉప ఎన్నిక జరగడం.. ఫలితాలు వెలువడడమే తరువాయి. ఇన్ని గండాలను దాటుకొని రేవంత్ ఎలా ముందడుగు వేస్తాడో చూడాలి. లేదంటే తన పదవికే గండం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. పార్టీలో సీనియర్లను కూడా పక్కన పెట్టి జూనియర్ అయిన రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం పగ్గాలు అప్పగించింది. మరి ఆయన హైకమాండ్ దగ్గర పాస్ అవుతాడా?