విశాఖ గర్జన అంటూ వైకాపా ప్లస్ ఉత్తరాంధ్ర జెఎసి కలిసి భారీ ప్రదర్శన నిర్వహించాయి. మా కోడీ కుంపటీ లేకపోతే తెల్లవారదు అనే భ్రమలో వున్న తెలుగుదేశం అను’కుల’ మీడియా ఈ వ్యవహారాన్ని పూర్తిగా విస్మరించింది. కవరేజ్ ఇవ్వలేదు. కనీసపు వృత్తి ధర్మం కూడా పాటించలేదు. ఓ సెక్షన్ ఆఫ్ కుల మీడియా మాత్రం ఇదే సంఘనటను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది. జనం రాలేదు. అంతా బుస్ అంటూ. ఇలా ఉత్తరాంధ్ర ఉద్యమాన్ని తక్కువ చేస్తున్న కుల మీడియా అధిపతులు అంతా ఒకే సామాజిక వర్గం, కృష్ణా గుంటూరు ఙిల్లాల బాపతు అన్నది అందరికీ తెలిసిందే. వాళ్లకు పడి బతకడానికి ఉత్తరాంధ్ర కావాలి. మైనింగ్ కు, పదవులకు, లిక్కర్ సిండికేట్ కు, హొటల్ సిండికేట్లకు అన్నింటికి ఉత్తరాంధ్ర కావాలి. కానీ ఉత్తరాంధ్రకు రాజధాని మాత్రం ఇవ్వకూడదు.
సరే, ఈ సంగతులు అన్నీ పక్కన పెట్టి, ఈ గర్జన సభ నిర్వహించడం వెనుక వైకాపా ఆలోచన ఏమిటి? అది కూడా ఆలోచించాలి కదా? మూడు రాజధానుల వైనం అన్నది ఉత్తరాంధ్రకు పెద్దగా పట్టలేదు. అది పచ్చి వాస్తవం. నిజంగా పట్టి వుంటే ఉత్తరాంధ్ర జనాలు కూడా కోట్లకు కోట్లు పూల్ చేసి, అరసవిల్లి టు అమరావతి అంటూ రివర్స్ ఉద్యమం నడిపి వుండేవారు. మీకు రాజధాని కావాలి అని అడగండి..విశాఖకు వద్దు అనే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అని నినదించి వుండేవారు.
ఇప్పుడేమయింది. విశాఖ గర్జన అనే హడావుడి తో అసలు ఏం జరుగుతోంది అన్న ఆలోచన ఉత్తరాంధ్ర వాసుల్లో మొదలవుతుంది. విశాఖకు రాజధాని కావాలని, అందుకోసమే ఈ గర్జన అన్న పాయింట్ జనాల్లోకి వెళ్తుంది. గర్జనకు వచ్చినా, రాకున్నా, గర్జన మీద ఆసక్తి వున్నా లేకున్నా, ఉత్తరాంధ్రలో రాజధాని అన్నది ఇప్పడు డిస్కషన్ పాయింట్ గా మారుతుంది. అంటే కొద్దిగా అయినా ఉత్తరాంధ్రకు రాజధాని అని వైకాపా అంటోంది. వద్దు అని తేదేపా అంటోంది. దీనిని ఫలానా వర్గం మీడియా వ్యతిరేకిస్తోంది. ఇలాంటి పాయింట్లు ఇక పల్లె రచ్చబండ దగ్గర వినిపించడం ప్రారంభం అవుతుంది.
అంటే ఉత్తరాంధ్రలో రాజధాని సెంటిమెంట్ ను కాస్తయినా ఈ గర్జన అన్నది రగిలిస్తుంది. ఇక నుంచి దీనిని గట్టిగా పట్టుకోగలిగితే ఎన్నికల నాటికి బలమైన సెంటిమెంట్ గా మారే అవకాశం వుంది. పైగా చంద్రబాబు ఏం చెబుతారు ఎన్నికల ముందు. తాము అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రను అన్ని విధాలా అభివృద్ది చేస్తామని, భూముల కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని అంటారు. వైకాపా జనాలు విశాఖను కొల్లగొట్టాయి అంటారు.
కానీ ఇక్కడ తెలియాల్సి ఏమిటంటే పత్రికల్లో రాకపోచచ్చు. కానీ విశాఖలో ఎవరు వ్యాపారాల్లో పాగా వేసారు. ఎవరు మైనింగ్, హోటల్, రియల్ ఎస్టేట్ ఇలా అన్నింటా పాగా వేసారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏ సామాజిక వర్గం గత రెండు దశాబ్దాల కాలంగా వందలాది ఎకరాలు హస్తగతం చేసకుంది అన్నది లోకల్ జనాలకు తెలుసు. అయితే పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.
కానీ ఇప్పుడు రాజధాని సెంటిమెంట్ రగులుకోవడం ప్రారంభమైతే అవన్నీ కూడా డిస్కషన్ పాయింట్లుగా. మారతాయి. సూది కోసం సోదికి వెళ్తే పాత రంకులు బయటకు వచ్చినట్లు, అసలు ఉత్తరాంధ్ర వాసులను కాదని, తెలుగుదేశం వలసవాదులను ఎలా తలకు ఎత్తుకుందీ అర్థం అవుతుంది. ఎంపీ టికెట్ లు, ఎమ్మెల్యే టికెట్ లు నాన్ లోకల్స్ కు ఎలా అంట కట్టిందీ తెలిసి వస్తుంది.
మొత్తం మీద గర్జన అన్నది జస్ట్ ఓ ఇగ్నీషియన్ పాయింట్ మాత్రమే. ఇంజన్ స్టార్ట్ అయితే బండి అదే వెళ్తుంది. ఎటొచ్చీ వైకాపా సరిగ్గా డ్రయివ్ చేయాలంతే.