ఊపిరి తీసిన పొగ.. హైదరాబాద్ లో దారుణం

దీపాల పండగ సంబరం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు. అంతలోనే దారుణం. హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో, ఊపిరాడక ఏడుగురు చనిపోయారు. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఈ…

దీపాల పండగ సంబరం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు. అంతలోనే దారుణం. హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో, ఊపిరాడక ఏడుగురు చనిపోయారు. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

నాలుగు అంతస్తుల భవనంలోని సెల్లార్ లో కారు గ్యారేజీ నిర్వహిస్తున్నారు. కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా బ్యాటరీ నుంచి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. పక్కనే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండడంతో వాటికి మంటలు వ్యాపించాయి. ఇరుగ్గా ఉన్న ప్రాంతం కావడంతో క్షణాల్లో బిల్డింగ్ మొత్తం పొగ వ్యాపించింది.

ఏం జరిగిందో తెలుసుకునేలోపే అన్ని ఇళ్లకూ పొగ వ్యాపించింది. దీంతో ఊపిరాడక ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతిచెందిన వాళ్లలో నాలుగు రోజుల శిశువు కూడా ఉంది. 

ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో 10 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే వాళ్లను సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 

పొగ వ్యాపించిన వెంటనే స్థానికులు అప్రమత్తమై కొందర్ని రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి నిచ్చెనల సహాయంతో మిగతావారిని బయటకు తీసుకొచ్చారు. రద్దీ ప్రాంతం కావడం, ఇరుకైన ఇళ్లు ఉండడం, రోడ్డు వైపు మినహా మిగిలిన మూడు వైపుల పూర్తిగా ఇళ్లు మూసుకుపోయి ఉండడంతో పొగ తీవ్రత ఎక్కువై, ప్రమాద తీవ్రత పెరిగింది.

జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అటు గవర్నర్ ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించారు.