తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసైని కేంద్రప్రభుత్వం ఉసిగొల్పిందా? అంటే …ఔననే సమాధానం వస్తోంది. గత కొంత కాలంగా మోదీ సర్కార్‌పై కేసీఆర్ విరుచుకుపడుతున్నసంగతి తెలిసిందే. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ సర్కార్‌ను రైతు వ్యతిరేకిగా నిలిపి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాల్ని టీఆర్ఎస్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో కేసీఆర్‌ను కూడా డిస్ట్రబ్ చేసేందుకు గవర్నర్ అస్త్రాన్ని కేంద్రం ప్రయోగిస్తోందనే అనుమానాలు లేకపోలేదు.
కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ కొన్ని రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలం ఉందని తెలంగాణ అధికార పార్టీ భావిస్తోంది. ఢిల్లీ పర్యటనలో గవర్నర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని టీఆర్ఎస్ మండిపడుతోంది. కేసీఆర్‌తో పాటు మంత్రులు, టీఆర్ఎస్ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా గవర్నర్ మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాను అనుకుని ఉంటే తెలంగాణ అసెంబ్లీ రద్దయి ఉండేదని గవర్నర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్నేహహస్తం చాచే వాళ్లు మాట్లాడే మాటలు ఇవేనా అని తమిళసైని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అలాగే రాజ్‌భవన్ తలుపులు తెరిచే ఉంటాయని, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వచ్చి సమస్య ఏమిటో చెప్పాలని, మీడియాముఖంగా కాకుండా స్వయంగా వచ్చి మాట్లాడాలని, సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ అంటూనే, ఆమె మాత్రం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రేరేపించేలా మాట్లాడ్డంలో ఔచిత్యం ఏంటని నిలదీస్తున్నారు. ఇదే సూత్రాన్ని తనకెందుకు వర్తింపచేసుకోవడం లేదో గవర్నర్ ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని హితవు చెబుతున్నారు.
కేసీఆర్ ఏదైనా చేయగలరని, తిమ్మిని బమ్మి చేస్తారని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించడం పక్కా రాజకీయమే అని ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు ప్రజల్లో పరపతి తగ్గిందని పొలిటికల్ కామెంట్స్ చేయడం వెనుక బీజేపీ ప్రోద్బలం లేకుండానే జరుగుతున్నాయా? అని తెలంగాణ అధికార పార్టీ గట్టిగా నిలదీస్తోంది.
మొత్తానికి గవర్నర్ తమిళిసై మాత్రం వ్యూహాత్మకంగా కేసీఆర్ సర్కార్‌ను రెచ్చగొట్టే చర్యలకు దిగారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రెండు వ్యవస్థల మధ్య పోరుకు ముగింపు ఎలా పలకనుందో మరి!