ఏపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆయన సామాజిక వర్గానికే చెందిన ఇద్దరు ఆశావహులకు చెక్ పెడుతున్నట్టు సమాచారం. ఈ దఫా మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో సామాజిక సమీకరణలు, జిల్లాల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీలు, ఎస్సీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిసింది.
మరోవైపు సీనియర్ మంత్రులను 10 మందిని తిరిగి కొనసాగించేందుకు జగన్ నిర్ణయించుకోవడం సంచలన ట్విస్ట్. కొనసాగే మంత్రుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని సమాచారం. ఈ దఫా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది.
ఇప్పటికే నెల్లూరుకు చెందిన కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మాట ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక రెడ్డి సామాజికవర్గంలో ఒక్కరికే మాత్రం అవకాశం మిగిలింది. ఆ ఒక్కరు ఎవరనేది చర్చనీయాంశమైంది.
తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి ఆర్కే రోజా ఆశావహుల జాబితాలో ఉన్నారు. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో రోజా, చెవిరెడ్డిలకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయని సమాచారం. ఈ మేరకు వారికి పరోక్షంగా సంకేతాలు అందినట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుణ్యమా అని చెవిరెడ్డి, రోజాకు మరోసారి తీవ్ర నిరాశే మిగలనుందని సమాచారం.
Yee pedhi reddy ki panni ledhu