ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం అందరికీ తెలిసిందే. మరి ఏటీఎం నుంచి బంగారం తీసుకోవడం ఎలా? ఇండియాలోనే తొలిసారిగా, హైదరాబాద్ లో మొట్టమొదటి గోల్డ్ ఏటీఎం వెలిసింది. బేగంపేటలో పెట్టిన ఈ ఏటీఎం మెషీన్ నుంచి బంగారం ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం?
ఈ ఏటీఎం నుంచి బంగారం తీసుకోవాలంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉంటే సరిపోతుంది. సాధారణంగా నగదు తీసుకోవడానికి వాడే డెబిట్ కార్డులు ఇక్కడ కూడా పనిచేస్తాయి. కాకపోతే ఎకౌంట్ లో బ్యాలెన్స్ ఉండాలంతే. వీటితో పాటు ప్రీ-పెయిడ్, పోస్ట్ పెయిడ్ కార్డుల్ని కూడా అందిస్తున్నారు.
ముందు కార్డు పెట్టాలి. బంగారం ఎంత కావాలో గ్రాముల్లో ఎంటర్ చేయాలి. ఆరోజు బంగారం ధరను అనుసరించి స్క్రీన్ పై ధర చూపిస్తుంది. ఓకే కొడితే, మన ఎకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి, ఏటీఎం నుంచి బంగారం బయటకొస్తుంది. ఇక ఈ బంగారం బ్లాక్ మార్కెట్లోకి వెళ్లిపోతుందనే భయం కూడా అక్కర్లేదు. ఏ కార్డు ద్వారా బంగారం కొనుగోలు చేశారో, ఆ ఖాతాకు లింక్ అయిన పాన్ కార్డ్, ఆధార్ కార్డు డేటాలో ఈ ట్రాన్సాక్షన్ నమోదవుతుంది.
ఈ ఏటీఎంలో 0.5 గ్రాముల బంగారం నుంచి వంద గ్రాముల బంగారం వరకు వివిధ రకాల బరువుల్లో అమ్ముతారు. పూర్తిగా 24 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే ఈ మెషీన్ లో పెడతారు. 22 క్యారెట్ బంగారం ఇక్కడ దొరకదు. ఒక ఏటీఎంలో గరిష్టంగా 5 కేజీల వరకు బంగారం పెట్టే సౌలభ్యం ఉంది.
5 కేజీల బంగారం పెట్టిన ఏటీఎంకు ఎంత భద్రత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏటీఎం మెషీన్ లోనే సెక్యూరిటీ అలర్టెలు చాలా ఉన్నాయి. ఆటోమేటిక్ వీడియో రికార్డింగ్ తో పాటు, మరో కెమెరా ఇందులో ఉంది. దీంతో పాటు గది, ఏటీఏం చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఏటీఎంకు 360 డిగ్రీల కోణంలో పూర్తిగా కెమెరాలు చుట్టుముట్టి ఉంటాయి.
ఇక వినియోగదారులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా క్షణాల్లో పరిష్కరించేందుకు కస్టమర్ కేర్ కూడా ఏర్పాటుచేశారు. ఈ ఏటీఎం క్లిక్ అయితే, రాబోయే రోజుల్లో హైదరాబాద్ లోని మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఏటీఎంలు పెట్టాలని అనుకుంటోంది గోల్డ్ సిక్కా సంస్థ. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా ఏటీఎంలు పెట్టబోతున్నారు.
ఈ ఏటీఎం నుంచి వారంలో 7 రోజులు, 24 గంటలు బంగారం కొనుక్కోవచ్చు. షాపుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ రోజు రేటు ఎంత ఉందో చెక్ చేయాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా బంగారం ధర ఈ మెషీన్ లో అప్ డేట్ అవుతుంది.