తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడా వ్యక్తి. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆమె చికెన్ వండలేదు. అవును.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో జరిగింది ఈ దారుణం.
చికెన్ వండమన్నాడు గాలిపెళ్లి పోశం. అయితే భర్త తెచ్చిన చికెన్ ను భార్య శంకరమ్మ వండలేదు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ నిద్రించారు. శంకరమ్మ పడుకుంది కానీ పోశం మాత్రం నిద్రపోలేదు. రాత్రంతా అదే ఆలోచనతో ఉన్నాడు. అతడిలో కోపం అస్సలు తగ్గలేదు.
దీంతో ఈరోజు ఉదయం నిద్రిస్తున్న శంకరమ్మపై దాడిచేశాడు పోశం. ఇంట్లో ఉన్న గొడ్డలితో విచక్షణరహితంగా నరికాడు. దీంతో శంకరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ వెంటనే పోశం అక్కడ్నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు, పోశం కోసం గాలిస్తున్నారు.
చిన్నచిన్న కారణాలకే హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఈమధ్య కాలంలో ఎక్కువైంది. 2 నెలల కిందట ఒంగోలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. క్షణికావేశంలో భార్యను చంపేశాడు భర్త. ఆ తర్వాత అతడు కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.