వలసలతో ఆ రెండు జాతీయ పార్టీలకు ప్రయోజనమేనా?

ఈ కాలంలో రాజకీయ పార్టీలకు వలసలు సర్వ సాధారణం. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు తేడా ఏమీ లేదు. మాది సిద్ధాంత నిబద్ధత ఉన్న పార్టీ అని చెప్పుకునే రాజకీయ పార్టీ…

ఈ కాలంలో రాజకీయ పార్టీలకు వలసలు సర్వ సాధారణం. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు తేడా ఏమీ లేదు. మాది సిద్ధాంత నిబద్ధత ఉన్న పార్టీ అని చెప్పుకునే రాజకీయ పార్టీ కూడా వలసల వ్యసనం నుంచి తప్పించుకోలేదు. వలసలను ప్రజలూ తప్పుపట్టడంలేదు. ఎన్నికల కమిషన్, స్పీకర్, రాష్ట్రపతి, గవర్నర్ వంటి రాజ్యాంగ వ్యవస్థలేవీ పట్టించుకోవడంలేదు. 

సాధారణ పరిస్థితుల్లో వలసలు ఉంటాయి. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే చెప్పక్కరలేదు. నాయకులు ఇబ్బడిముబ్బడిగా పార్టీలు మారుతారు. ఇందుకు ఎన్నో కారణాలుంటాయి. ఎన్నో ప్రలోభాలుంటాయి. తెలంగాణా విషయానికొస్తే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పటికీ వలసలను ప్రోత్సహిస్తూనే ఉంది. బీజేపీని, కాంగ్రెస్ ను దెబ్బ తీయాలంటే దానికి అదొక్కటే మార్గం.

ఇక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ను, బీజేపీని దెబ్బ కొట్టాలన్నా, బీజేపీ అటు కాంగ్రెస్ ను, ఇటు టీఆర్ఎస్ ను బలహీనం చేయాలన్న వలసలే మార్గం. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా. అధికారం సాధించడానికి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీలు పడుతున్నాయి. గెలుపు కోసం ఈ పార్టీలు అనుసరిస్తున్న అనేక మార్గాల్లో, వ్యూహాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను ఆకర్షించడం కూడా ఒకటి.  

ప్రస్తుతం మూడు పార్టీల్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. విపక్ష బీజేపీ, కాంగ్రెస్ వలసలకు తెర తీశాయి. అధికార పార్టీలోని అసమ్మతి నేతలకు గాలం వేస్తూ తమ పార్టీలో చేరేలా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఏకంగా చేరికల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇది విచిత్రమైన విషయమే. 

కాంగ్రెస్ చేరికల కమిటీ కన్వీనర్ గా సీనియర్ నేత జానా రెడ్డి ఉండగా.. బీజేపీ చేరికల కమిటీ బాధ్యతలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అప్పగించారు. ఇతర పార్టీల నుంచి నాయకులు, నాయకురాళ్లను చేర్చుకోవడానికి ఈ చేరికల కమిటీల అధిపతులు శక్తి యుక్తులను ఉపయోగించాల్సి ఉంటుంది. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బీజేపీలో భారీగా చేరికలు జరగగా.. ఇటీవల కాంగ్రెస్ లో ఎక్కువమంది జాయిన్ అవుతున్నారు. 

ఇటీవలే మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, ఎర్రశేఖర్, తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. గ్రేటర్ కార్పొరేటర్ విజయా రెడ్డి, కొందరు నియోజకవర్గ స్థాయి నేతలు కూడా హస్తం పార్టీలో చేరిపోయారు. ఇటీవలే బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ గా నియమితులైన ఈటల రాజేందర్ తన ఆపరేషన్ మొదలు పెట్టారని తెలుస్తోంది.

అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో పాటు కాంగ్రెస్ నేతలతో ఆయన మాట్లాడుతున్నారని తెలుస్తోంది. చేరికలపై బీజేపీ ఫోకస్ చేయడంతో అప్రమత్తమైన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని అంటున్నారు. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీకి షాకిచ్చేలా ఆయన స్కెచ్ వేశారని తెలుస్తోంది. దాదాపు 20 మంది కీలక నేతలు రేవంత్ రెడ్డి టచ్ లోకి వచ్చారని అంటున్నారు. 

సిరిసిల్లలో జరగబోయే రాహుల్ గాంధీ సభలో టీఆర్ఎస్ తో పాటు బీజేపీలో ఉన్న కొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఠాగూర్ లు అర్దరాత్రి వేళ కొందరు నేతలతో చర్చలు జరిపారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఎవరితో చర్చలు జరిపారు.. రాహుల్ సభలో పార్టీలో చేరేది ఎవరు అన్న విషయాలను పీసీసీ నేతలు గోప్యంగా ఉంచుతున్నారు. రాహుల్ గాంధీ సభకు రెండు, మూడు రోజుల ముందు వలస నేతలు వివరాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వలసల వల్ల రెండు జాతీయ పార్టీలకు ప్రయోజనం ఉంటుందా? విజయావకాశాలు మెరుగు పడతాయా?