వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై టీకాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. పాదయాత్రలో భాగంగా జగ్గారెడ్డిపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రోజుకో పార్టీ మారుతూ, జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని జగ్గారెడ్డిపై షర్మిల మండిపడ్డారు. ఈ నేపథ్యంలో షర్మిలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే షర్మిల ఎత్తుగడ అన్నారు.
నాడు పాదయాత్ర చేస్తూ జగన్ వదిలిన బాణంగా షర్మిల చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఇక్కడ దస్తి వేసి వైఎస్ వదిలిన బాణం అని చెబుతోందని జగ్గారెడ్డి విమర్శించారు. జగన్, బీజేపీ వదిలిన బాణం షర్మిల అని జగ్గారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ప్రజల ఓటును చీల్చడమే షర్మిల ఉద్దేశమన్నారు. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా దర్శకత్వంలో షర్మిల పని చేస్తున్నారన్నారు. ఆంధ్రా ప్రాంత ఓటు బ్యాంక్‌ను చీల్చితే బీజేపీకి ఉపయోగపడుతుందనే ఎత్తుగడతో వైఎస్ విజయమ్మ సహా జగన్, షర్మిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
అంతిమంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదనే బీజేపీ స్కెచ్‌లో భాగంగా షర్మిల పని చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ వ్యూహంలో షర్మిల, జగన్ పావులన్నారు. షర్మిల ఓట్ల చీలిక రాజకీయాలను తెలంగాణ, ఏపీ ప్రజలు గమనించాలని ఆయన కోరారు. గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలకు కేంద్రం కారణమని జగన్, షర్మిల విమర్శించి వుంటే చూపాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న షర్మిల, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. వైఎస్సార్‌ను అభిమానిస్తున్న తనలాంటి వాళ్లతో ఆయన్ని తిట్టించడానికి షర్మిలే బాధ్యత వహించాలని కోరారు.
తండ్రి పరువు తనే తీస్తోందని మండిపడ్డారు. తమను తిట్టి, ఆ తర్వాత వైఎస్‌ను తిట్టించి మీ తండ్రి పరువు మీరే తీస్తున్నారని షర్మిలపై విరుచుకుపడ్డారు. షర్మిలకు ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో కానీ ఆమె ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని ఉచిత సలహా ఇచ్చారు. వైఎస్ కూతురువి అయితే మాత్రం తిడితే ఊరుకుంటామా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తిట్టడం కాదు ప్రజలకు ఏం చేస్తావో చెప్పి ప్రచారం చేసుకోవాలని జగ్గారెడ్డి కోరారు.