కమలదళంలో క్రైస్తవ గళం!

సినీ నటి జయసుధ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అచ్చమైన హిందూత్వ భావజాలానికి నిలువెత్తు రూపం అయిన భారతీయ జనతా పార్టీలోకి, క్రైస్తవ మతం ఆచరించే జయసుధ ఎందుకు చేరారబ్బా? అనే అనుమానం…

సినీ నటి జయసుధ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అచ్చమైన హిందూత్వ భావజాలానికి నిలువెత్తు రూపం అయిన భారతీయ జనతా పార్టీలోకి, క్రైస్తవ మతం ఆచరించే జయసుధ ఎందుకు చేరారబ్బా? అనే అనుమానం కొందరికి కలగవచ్చు. ఢిల్లీలో తరుణ్ ఛుగ్, కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన జయసుధ కూడా.. సరిగ్గా ఆ విషయంలోనే తన వివరణ ఇచ్చారు. క్రైస్తవ మతానికి రెప్రజెంట్ చేస్తూ, క్రైస్తవులకు మంచి చేయడానికి తాను పనిచేస్తానని ఆమె తన చేరిక సందర్భంగా ప్రసంగంలో వెల్లడించారు.

సినీ నటి జయసుధకు రాజకీయ జీవితం కొత్త కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. ఆమె ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ అప్పట్లో ఆమెను వ్యూహాత్మకంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. అక్కడి అసెంబ్లీ సీటులో క్రైస్తవుల ఓట్లు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఆమె అక్కడినుంచి సులువుగానే గెలిచారు. అయితే వైఎస్ తదనంతరం ఆమె రాజకీయ జీవితానికి దిక్కూమొక్కూ లేకుండా పోయింది. పేరుకు కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పటికీ.. ఆమెకు పెద్దగా విలువ దక్కలేదు.

ఎప్పటిలా సినిమాలు చేసుకుంటున్నారు గానీ.. రానురాను అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. పూర్తిగా ఖాళీ అయిపోవడం ఆమెకు ఇష్టం లేదన్నట్టుగా మళ్లీ రాజకీయాలవైపు చూశారు. అయితే కాంగ్రెసులో ఆమెకు విలువ దక్కే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. దాంతో ఆమె భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ప్రస్తుతం.. ఎవరు వచ్చినా సరే.. రెడ్ కార్పెట్ వేసి తమ పార్టీలో కలిపేసుకునేలా ఉంది. ఆ నేపథ్యంలో జయసుధకు కూడా మంచి స్వాగతమే లభించింది.

ఢిల్లీలో తన చేరిక సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. తాను ఒక మతాన్ని రెప్రజెంట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా.. తాను అందరిదాన్ని అని వ్యాఖ్యానించారు. ఒక సినిమా నటిగా తనను అందరూ అభిమానిస్తారని ఆమె చెప్పుకొచ్చారు. అయినా కూడా.. క్రైస్తవాన్ని రెప్రజెంట్ చేస్తూ వారి కోసం తాను పనిచేస్తానని జయసుధ అన్నారు. ఈ మాటలు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడానికి ఉపకరిస్తాయని ఆమె ఆలోచన కావొచ్చు. 

కానీ.. హిందూత్వ పార్టీలో క్రైస్తవ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడం ఆమెకు సాధ్యమేనా? అనే సందేహం పలువురికి కలుగుతోంది. ఆమె ఎలా నెట్టుకొస్తారో చూడాలి.