కాంబో ప్యాకేజీ అనేది ఇప్పుడు చాలా విస్తృతంగా వాడుకలో ఉండే పదంగా మారుతోంది. రెస్టారెంటుకు వెళితే.. మనం ఒకటి తినాలని అనుకుంటే.. దానితో పాటు మరికొన్ని తినేలా కాంబో ప్యాకేజీలు ఊరిస్తాయి. అదే తరహాలో మెడికల్ టెస్టులు, ఆస్పత్రి సర్జరీలు కూడా కాంబో ప్యాకేజీలుగా వస్తున్నాయి.
సూపర్ మార్కెట్లలో వీటిజోరు బాగా ఉంటుంది. అయితే ఇప్పుడు రాజకీయాల్లో కూడా కాంబో ప్యాకేజీ వస్తోంది. భారాస నుంచి కాంగ్రెసులోకి నెమ్మది నెమ్మదిగా పలువురు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిరాయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఒకే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఇద్దరూ కాంబో ప్యాకేజీలాగా కాంగ్రెసులో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఆలంపూరు నియోజకవర్గానికి చెందిన భారాస ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి పనులను చేపట్టడం గురించి ఆయన ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఆలంపూరు జోగులాంబ ఆలయ అభివృద్ధిని, ఫోర్ లైన్ హైవే పనులను ఆయన కోరారు.
అయితే సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి తమ నియోజకవర్గ పనుల కోసం వినతిపత్రాలు ఇవ్వడం అంటే ఏమిటో దాని అర్థం ప్రజలకు తెలుసు. అదే విధంగా భారాస ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి త్వరలోనే కాంగ్రెసులో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇటీవలే ఒకేరోజులో ఏకంగా ఆరుగురు భారాస ఎమ్మెల్సీలు కాంగ్రెసులో చేరిన సంగతి అందరికీ తెలుసు. ఆ రకంగా అధికార పార్టీ మండలిలో బలం పెంచుకుంది. ఇప్పుడు మరో ఎమ్మెల్సీ చేరబోతున్నారు.
ఎమ్మెల్సీ చల్లాతో పాటు ఆలంపూరు భారాస ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెసులోకి ఫిరాయించబోతున్నట్టుగా వార్తలు వినవస్తున్నాయి. అదే జరిగితే.. కాంగ్రెసుకు కాంబో ప్యాకేజీ అవుతుంది. అలాగే భారాసకు పెద్ద దెబ్బగానే పరిగణించాలి.
ఒకవైపు గులాబీ అధినేత కేసీఆర్.. 2028లో అతి భయంకరమైన మెజారిటీతో మనమే అధికారంలోకి వస్తాం అని పదేపదే చెబుతున్నప్పటికీ.. ఆ మాటలు నమ్మలేక నాయకులు ఒక్కరొక్కరుగా కాంగ్రెసులోకి జారుకుంటూ ఉండడం గమనార్హం.