మునుగోడులో నవ్వులు పూయించాడు…వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తాడో !

సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా మొత్తం సీరియస్ గా ఉండకూడదు. మధ్యలో కామెడీ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులకు, జనాలకు కాస్త రిలీఫ్ గా ఉంటుంది. కొద్దిసేపు నవ్వుకోవచ్చు. మునుగోడు ఎన్నికల్లో అలా నవ్వులు పూయించిన…

సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా మొత్తం సీరియస్ గా ఉండకూడదు. మధ్యలో కామెడీ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులకు, జనాలకు కాస్త రిలీఫ్ గా ఉంటుంది. కొద్దిసేపు నవ్వుకోవచ్చు. మునుగోడు ఎన్నికల్లో అలా నవ్వులు పూయించిన వ్యక్తి మత బోధకుడు లేదా మత ప్రచారకుడు కేఏ పాల్. ఆయన తాను సీరియస్ గా ఉన్నానని అనుకుంటాడు. సీరియస్ గా మాట్లాడతాడు. కానీ ఆయన్ని చూసేవారికి, ఆయన మాటలు వినేవారికి కామెడీగా ఉంటుంది. ఆపుకోలేని నవ్వు వస్తుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికలో నవ్వులు పూయించడమే కాకుండా, నవ్వుల పాలయ్యాడు కూడా.

రాజకీయాల్లోకి రాకముందు వరకు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, గొప్ప గౌరవం ఉంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు కూడా తనతో మాట్లాడాడని, కొన్ని వందల దేశాల అధినేతలు తనతో టచ్ లో ఉన్నారని, తాను వారిని ఆశీర్వదించానని, తన రాక కోసం వారు ఆతృతగా ఎదురు చూస్తారని పాల్ చెప్పుకుంటాడు. ఆయన చెప్పేదాంట్లో కొంత నిజం ఉండొచ్చు, కొంత అతిశయోక్తి ఉండొచ్చు. తాను తలచుకుంటే మిలియన్ డాలర్లు, ట్రిలియన్ డాలర్లు తెచ్చి ఇండియాను డెవలప్ చేస్తానంటాడు. ఇలాంటివి ఎన్నో పాల్ చెబుతుంటాడు. కానీ పొలిటికల్‌ ఎంట్రీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆయన కమెడియన్‌గా మారిపోయాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి జోకర్‌గా మారిపోయాడు. 

అభ్యర్థి ప్రకటన నుంచి కౌంటింగ్‌ వరకూ ఆయన తీరు హాస్యాస్పదమైంది. అభ్యర్థిగా గద్దర్‌ పోటీ చేస్తారని ప్రకటించాడు. ఆయన చెయ్యి ఇవ్వడంతో  తర్వాత తానే బరిలో నిలిచాడు. నామినేషన్‌ తర్వాత ఉంగరం గుర్తు రావడంతో పది వేళ్లకు ఉంగరాలు ధరించి ప్రచారం చేశాడు. రైతు వేషం కట్టాడు. రోడ్డు పక్క హోటల్లో దోశెలు వేశాడు. మాస్‌ పాటలకు డ్యాన్స్‌ చేశాడు. సైకిల్‌ తొక్కాడు. చిన్న పిల్లలతోనూ గెంతులు వేశాడు. ఇక కౌంటింగ్‌ కేంద్రంలో అయితే పరుగో పరుగు అంటూ నవ్వులు పూయించాడు. పోలింగ్‌ తర్వాత 50 వేల మెజారిటీ సాధిస్తానని చెప్పి ఆశ్చర్యపరిచాడు. కానీ తీరా చూస్తే వెయ్యి ఓట్లు కూడా వచ్చిన దాఖలాలు లేవు. కౌంటింగ్ లో కేఏ పాల్ కి వచ్చిన ఓట్లు ఎంతో తెలిసి జనం  పగలబడి నవ్వుకుంటున్నారు. 

7 రౌండ్ల ఓట్లలో సుమారు 60 వేల ఓట్లు లెక్కిస్తే పాపం  పాల్ కి కేవలం 320 ఓట్లు మాత్రమే వచ్చాయట..ఇది ఇప్పుడు హైలైట్ గా మారింది..దీనిపై పాల్ స్పందిస్తూ ‘2 లక్షల మంది ఓటర్లు ఉన్న మునుగోడు లో మాకు లక్ష ఓట్లు కచ్చితంగా వచ్చి ఉంటాయి. కానీ బీజేపీ, టీఆరెస్ పార్టీలు ఈవీఎంలు గ్యాంబ్లింగ్ చేసాయి..మొన్ననే నేను చూశాను..సుమారు 240 ఖాళి ఈవీఎం లు ఇక్కడకి తీసుకొచ్చి దొంగ ఓట్లు గుద్దించారు..ఈ సమాచారం మొన్న మేము మీడియా కి కూడా వెల్లడించాము అని అన్నాడు. ‘దీనిపై మేము కచ్చితంగా న్యాయం కోసం కోర్టు కి వెళ్లి పోరాటం చేస్తాం..ఈ ఎలక్షన్ ని రద్దు చేయించి మళ్ళీ ఎన్నికలు పెట్టిస్తాను..ఈసారి ఈవీఎంలు లేకుండా పోస్టల్ బాలట్ వోటింగ్ ఉండేలా తెస్తాను..కచ్చితంగా మాకు లక్ష మంది ఓట్లు వేశారు ఈ ఎన్నికలలో..అది మాత్రం బలంగా చెప్పగలను అంటూ పాల్ చేస్తున్న కామెడీ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రేండింగ్ అవుతుంది.

తెలంగాణకు నెక్ట్స్ సీఎం తానేనంటూ కేఏ పాల్ కొన్ని రోజుల కిందట అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ నేడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో తేలిపోయారు. అత్యధిక ఓట్లు తెచ్చుకుంటున్న అభ్యర్థులలో టాప్ 5లో కూడా నిలువలేకపోయాడు. తెలంగాణకు కాబోయే సీఎంను రెస్పెక్ట్ ఇవ్వాలంటూ అధికారులను బెదిరించాడు. ఈవీఎంలతో ఓటింగ్ వద్దు అని తాను కోరినా పట్టించుకోలేదన్నాడు. 

ఫలితాలకు ముందే విజయోత్సవ ర్యాలీకి అనుమతి తీసుకున్నామని చెప్పిన పాల్.. ఐదు రౌండ్ల తరువాత టాప్ 5లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. రౌండ్ రౌండ్ కు వంద ఓట్లు కూడా రాలేదు. కావాలనే తనపై కక్షకట్టి తన ఓటర్లను కొనేశారని పాల్ ఆరోపించాడు. రీ కౌంటింగ్ కి దరఖాస్తు చేస్తానని చెప్పాడు. ఈ కామెడీ కింగ్ వచ్చే ఎన్నికల్లోనూ జనాలను కడుపుబ్బా నవ్విస్తాడేమో!