అసలు నిందను సైడ్ లైన్ చేస్తున్న కవితక్క!

మాట దూకుడు ప్రదర్శించడంలో భాజపా నాయకుల్లో నిజమాబాద్ ఎంపీ అర్వింద్ కూడా ముందు వరుసలో ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా మంచి తెలంగాణ సహజమైన యాసలో.. నుడికారాలు, సామెతలతో విరుచుకుపడడంలో ఆయనకు ఆ పార్టీలో…

మాట దూకుడు ప్రదర్శించడంలో భాజపా నాయకుల్లో నిజమాబాద్ ఎంపీ అర్వింద్ కూడా ముందు వరుసలో ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా మంచి తెలంగాణ సహజమైన యాసలో.. నుడికారాలు, సామెతలతో విరుచుకుపడడంలో ఆయనకు ఆ పార్టీలో సాటి లేరు. అలాంటి ఎంపీ అర్వింద్ ఇప్పుడు కేసీఆర్ కుటుంబం మీద విరుచుకుపడ్డారు. 

పేద ప్రజలకు ఆరోగ్య బీమా ఇవ్వకుండా చచ్చిపోతే 5 లక్షలు వచ్చేలా లైఫ్ ఇన్సూరెన్స్ బీమా ఇవ్వడాన్ని ఎద్దేవా చేస్తూ.. ఆయన కేటీఆర్ కు పది లక్షలకు, కవితకు 20 లక్షలకు తాను బీమా చేయిస్తానని గేలి చేశారు. నిజానికి కవిత మీద ఇంకా నిర్దిష్టమైన ఆరోపణలు కూడా మరికొన్ని చేశారు.

అయితే కల్వకుంట్ల కవిత మాత్రం.. ఎంపీ అర్వింద్ తమ చావు గురించి మాట్లాడుతున్నాడంటూ.. ‘చావు’ను హైలైట్ చేసి, వ్యక్తిగత విషయాలపై విషం కక్కుతున్నారని ఆగ్రహిస్తోంది. వ్యక్తిగత విషయాలపై విషం చిమ్ముతారా? అంటూ వ్యాఖ్యనిస్తోంది. ‘నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా, మీ అన్న చచ్చిపోతే 10 లక్షలు ఇస్తా’ అంటూ అర్వింద్ మాట్లాడారని, ఆ భాష ఎలా కరెక్టో ప్రజలు ఆలోచించాలని కవిత అంటోంది. 

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రాపాలకులపై కేసీఆర్ ఇలాంటి భాష మాట్లాడలేదని కవిత అంటున్నారు గానీ.. కేసీఆర్ అంతకంటె నీచమైన, ఘోరమైన పదజాలంతోనే.. ఆంధ్రా పాలకుల్ని మాత్రమే కాదు కదా, ఆంధ్రకు సంబంధించిన మామూలు పౌరులందరినీ కూడా తూలనాడుతూ మాత్రమే ప్రజల్లో భావోద్వేగాలు, శత్రుభావనలు పెంచారనేది అందరికీ తెలుసు. ‘చావు’ అనే పదం వాడినందుకు అర్వింద్ విమర్శలను తప్పుపడుతున్న కవిత.. ఆయన చేసిన అసలు ఆరోపణలను పక్కదారి పట్టించారనేది పలువురు అభిప్రాయంగా ఉంది.

ఎంపీ అర్వింద్.. కవిత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని, వారిద్దరూ ఒకే కంపెనీలు డైరక్టర్లుగా ఉన్నారని ఆరోపించారు. భారాస- కాంగ్రెస్ అక్రమ సంబంధాల గురించి బిజెపి ఆరోపణలు చేస్తుండే సంగతి అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లుగా ప్రస్తుతం భారాస ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా చేసి కాంగ్రెసులోకి వెళుతుండగా, దాని వెనుక కవిత వ్యూహం ఉన్నట్టు అర్వింద్ ఆరోపిస్తున్నారు. 

కవిత తాను స్వయంగా రేవంత్ తో మాట్లాడి ఆకుల లలితకు నిజామాబాద్ అర్బన్ టికెట్ ఇప్పిస్తున్నారని.. ఆయన ఆరోపించారు. వారిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు.. ఇలా అభ్యర్థుల ఫిరాయింపుల వెనుక మంత్రాంగం అనేదే ప్రధాన ఆరోపణ. కవిత దానికి జవాబివ్వకుండా.. ఆయన చేసిన ఇన్సూరెన్సు ఆరోపణలను మాత్రమే ప్రస్తావిస్తూ రచ్చ చేస్తున్నారు. తన మీద వచ్చిన అసలు విమర్శలను పక్కదారి పట్టించడానికి చూస్తున్నారనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.