బీహార్ లో జేడీయూ -ఎన్డీయే బంధం తెగిపోవడం కేసీఆర్ కు ఎంతో సంతోషం కలిగిస్తోంది. సీఎం నితీష్ కుమార్ ఎన్డీయేకు గుడ్ బై చెప్పి చాలా ఏళ్ళ తరువాత పాత కూటమి మహా ఘట్ బంధన్ ను పునరుద్ధరించి మళ్ళీ పాత మిత్రులను అక్కున చేర్చుకోవడం, ఆర్జేడీతో చేతులు కలపడం కేసీఆర్ కు సంతోషంగా ఉంది.
తన బీజేపీ వ్యతిరేకతకు ఈ పరిణామమం ఊతమిచ్చినట్లుగా భావిస్తున్నారు. తాను తలపెట్టిన బీజేపీ వ్యతిరేక కూటమికి ఇది దోహదం చేస్తుందని అనుకుంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ని త్వరలోనే కలుసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
తేజస్వి యాదవ్ ఈ ఏడాది జనవరిలో హైదారాబాదులో కేసీఆర్ ను కలుసుకున్నారు. అప్పట్లో తన థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలను కేసీఆర్ ఆయనకు వివరించారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి నుంచి నితీష్ తొలగిపోయారు కాబట్టి ఆయనతో తన ఆలోచనలు కేసీఆర్ పంచుకునే అవకాశం ఉందంటున్నారు. ఇలా ఉండగా, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా తెర మీదికి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు దీనిపై జాతీయ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ప్రధాని పదవికి పోటీదారు అనుకున్నారు. కానీ మంత్రి ఒకరు కుంభకోణంలో ఇరుక్కోవడంతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నితీష్ ప్రతిపక్షాల తరపున ప్రధాని పదవికి అభ్యర్థిగా తెర మీదికి తీసుకురావాలని అపోజిషన్ ప్రయత్నం చేయవచ్చని తెలుస్తోంది. మమతా బెనర్జీ కంటే నితీష్ కుమార్ బెటరనే అభిప్రాయం సీపీఎం వ్యక్తం చేసింది.
బెంగాల్ దాటి మమతా ప్రభావం లేదని అభిప్రాయపడుతోంది. నితీష్ కు దేశవ్యాప్త ఇమేజ్ ఉందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. హిందీ బెల్టును ఆయన ప్రభావితం చేస్తాడంటున్నాయి. ఇక సామాజికవర్గం విషయం చూసుకున్నా మోడీ, నితీష్ ఇద్దరూ ఓబీసీ కేటగిరీ కిందికే వస్తారు. ఇదొక ప్లస్ పాయింట్ అంటున్నారు.