వరదలపై కుట్ర ఉన్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే నూతన విధానంలో వరదలు సృష్టిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం కరకట్టను పరిశీలించారు. భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ముంపు బాధితులను కేసీఆర్ పరామర్శించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ కుండపోత వర్షంపై ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్టు చెబుతున్నారన్నారు. ఇందులో నిజం ఎంతో ఇంకా తెలియలేదన్నారు. విదేశీయులు మన దేశంలో అక్కడక్కడ కావాలనే క్లౌడ్ బరస్ట్ సృష్టిస్తున్నట్టు ఆరోపణలున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు.
గతంలో కశ్మీర్, లేహ్ వద్ద ఇలాంటి కుట్రలు జరిగినట్లు వార్తలొచ్చాయన్నారు. ఇతర దేశాలు క్లౌడ్ బరస్ట్‌తో ఇలాంటి కుట్రలు చేస్తున్నాయనే చర్చ ఉందన్నారు. గోదావరి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. దీనిపై నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు.
గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలం జలమయమైంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వరద తాకిడికి పలువురు మృత్యువాత పడ్డారు. పంట, ఆస్తి నష్టం భారీ మొత్తంలో జరిగింది.
ఇదంతా తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కృత్రిమంగా సృష్టించిన వరదగా కేసీఆర్ అనుమానాల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ అనుమానాలపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మరి!