బెదిరింపులకు లొంగడం అనేది ఖచ్చితంగా బలహీనత. కానీ, వ్యతిరేకతకు తలొగ్గడం అనేది అర్థం చేసుకోవడం అనిపించుకుంటుంది. సరిగ్గా ఈ రెండు రకాల సిద్ధాంతాల మధ్య నలిగిపోయే పరిస్థితిలో ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారనున్న మునుగోడు ఉపఎన్నిక తెరాస తరఫున అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు కీలకంగా చర్చకు వస్తోంది. మునుగోడులోని తెరాస పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రెండు గ్రూపులుగా చీలిపోయి.. ఎవరికి వారు తమ అభిప్రాయాలను తీవ్ర స్వరంతో వినిపించకుండా ఉండేట్లయితే ఈ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఆ దశ దాటిపోయినట్టుంది.
తెరాస అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామని అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ డిమాండ్ కొత్తగా ఇవాళే వినిపించినది కాదు. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అని ఖరారైన నాడే బయటకు వినిపించింది. అప్పటికప్పుడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని.. అసమ్మతి గళాలను హైదరాబాదు పిలిపించి.. తన ఇంట్లో సమావేశం నిర్వహించి.. కాసేపటికి.. మునుగోడులో అంతా ప్రశాంతం అంటూ అందరితో కలిపి మీడియాకు ప్రకటించారు. కానీ అప్పుడు ఆయన అలా కప్పెట్టిన నిప్పు ఇప్పుడు మళ్లీ రాజుకుంది. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని మళ్లీ గళమెత్తారు.
కూసుకుంట్లను ఓడిస్తారా, గెలిపిస్తారా? అనేది ఇక్కడ టాపిక్ కానే కాదు. కానీ.. తానే మోనార్క్ గా, తన మాట వేదంగా భావించే కేసీఆర్ సామ్రాజ్యం.. తెలంగాణ రాష్ట్ర సమితిలో.. ‘నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావంటే మేం ఒప్పుకోం’ అని చెప్పే పరిస్థితి రావడం! సరిగ్గా ఇంకో వారం రోజుల్లో కేసీఆర్.. మునుగోడు నియోజకవర్గంలో పర్యటించడానికి సిద్ధం అవుతున్నారు. ఆ మరుసటి రోజున అమిత్ షా కూడా అక్కడ భారీ సభ నిర్వహించబోతున్నారు.
ఇప్పుడు పార్టీ శ్రేణుల వ్యతిరేకతను మన్నించి కేసీఆర్.. కూసుకుంట్లకు టికెట్ నిరాకరిస్తారా? లేదా, 20న తన పర్యటనలో ఈ అసమ్మతి స్వరాలను ఊరడిస్తారా? లేదా, 21న జరిగే సభలో ఆ అసమ్మతి వాదులంతా బిజెపిలోకి వలస వెళ్లడానికి తానే స్వయంగా రెడ్ కార్పెట్ పరుస్తారా? అనేవి చర్చనీయాంశాలు.
మునుగోడు నియోజకవర్గం రాజకీయంగా బాగా వేడి పుట్టించడం సహజం. కానీ.. అధికార పార్టీలో పుట్టిస్తున్నది వేడి కాదు. మంట. ఈ మంట బాగా రాజుకుని స్థానికంగా పార్టీ బలాన్ని దహించేస్తుందో లేదో తెలియదు.
కూసుకుంట్లకు ఇస్తారని స్థానిక నేతలు ఎందుకు అనుకుంటున్నారో కూడా తెలీదు. ఎందుకంటే.. 2018 ఎన్నికల్లో తెరాస హవా బాగా వీచిన రోజుల్లో ఆయన 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకుముందు 2014లో గెలిచినా ఆయన సాధించిన ఓట్లు కేవలం 70 వేలే! మరి ఆ టికెట్ ను ఎంతో మంది ఉద్ధండులు ఆశిస్తుండగా.. కూసుకుంట్లకు ఇస్తారనే భయం, అనుమానం లోకల్ లీడర్లలో ఎందుకు కలుగుతోందో తెలీదు.