బిజెపి కాంగ్రెస్ లేని జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని, వీలైతే తానే సారథ్యం వహించాలని, అదృష్టం కలిసి వస్తే ప్రధాని పీఠాన్ని అధిష్టించాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వప్నం. అందుకోసం ఆయన తొలి నుంచి చాలా చాలా కష్టపడుతున్నారు. దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నాయకుల ఇళ్లకు వెళుతున్నారు. విందులు స్వీకరిస్తూ బంధాలు పెంచుకుంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. ఆయన స్వప్నం నెరవేరుతుందా లేదా అనేది మాత్రం సందేహమే.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభావానికి గండి కొట్టి, నరేంద్ర మోడీని ప్రధాని పీఠం నుంచి దించడానికి చాలా శ్రద్ధగా పనిచేస్తున్న శక్తులు ఇంకా ఉన్నాయి. అయితే వారెవరికీ కూడా కాంగ్రెస్ పట్ల అపరిమితమైన ద్వేషం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపి, కాంగ్రెస్ రెండింటికీ సమాన దూరం పాటించాలనే కోరిక లేదు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడ తన కుటుంబ అధికార వైభవానికి లోటు రాకుండా ఉండేందుకు మాత్రమే.. కెసిఆర్ కాంగ్రెస్ కూడా లేని జాతీయ కూటమి మాత్రమే ఉండాలని అభిలషిస్తున్నారు. మిగిలిన బీజేపీ వ్యతిరేక పార్టీలలో చాలామందికి ఆ స్థాయి కాంగ్రెస్ వ్యతిరేకత లేకపోవడం కెసిఆర్ కు అశనిపాతం.
తాజాగా జాతీయ రాజకీయాల్లో వినిపిస్తున్న వార్త ఆయనకు ఇంకా చేదుగా అనిపిస్తుంది. కెసిఆర్ స్థాయిలో కాకపోయినా, కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్న సీనియర్ నాయకురాలు మమతా బెనర్జీ. ఆమెతో కూడా కేసీఆర్ పలుమార్లు మంతనాలు జరిపారు. ఆమెకు కూడా ప్రధాని పదవి మీద ఆశ ఉంది. అయితే మమతా బెనర్జీ ప్రస్తుతం కేంద్రంలో బలమైన కూటమి ఏర్పడడం కోసం కాంగ్రెసుతో ఉన్న విభేదాలకు స్వస్తి పలకడానికి సిద్ధంగా ఉన్నదని సంకేతాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మోడీ వ్యతిరేక కూటమి ఏర్పడడానికి శ్రద్ధగా ప్రయత్నిస్తున్న మరో కీలక నాయకుడు శరద్ పవార్ స్వయంగా ప్రకటించడం విశేషం.
వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ తో చేతులు కలపడానికి ఆమెకు విముఖత లేదని అంటున్నారు. అదే జరిగితే జాతీయ రాజకీయాల్లో ఏర్పడబోయే బలమైన కొత్త కూటమిలో కేసీఆర్ వాదన ఒంటరిది అవుతుంది. కాంగ్రెస్ వద్దు అని చెప్పే వాళ్ళు మరెవ్వరూ ఉండరు.
కెసిఆర్ ఇప్పటిదాకా కలిసి మంతనాలు సాగించిన ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నాయకులలో స్టాలిన్, దేవేగౌడ, హేమంత్ సొరేన్, నితీష్ కుమార్, శరద్ పవార్ తదితరులు అందరూ కూడా కాంగ్రెస్తో స్నేహానికి సిద్ధంగానే ఉన్నారు. లోకల్ పాలిటిక్స్ కారణంగా కాంగ్రెస్ ను దూరం పెట్టాలని గట్టిగా కోరుకుంటున్నది కేవలం కేసీఆర్ ఒక్కరే. 17 సీట్లు మాత్రమే ఉన్న రాష్ట్రం ప్రతినిధిగా కేసీఆర్ మాటకు.. ఏర్పడబోయే కొత్తకూటమిలో ఎంత విలువ ఉంటుందో తేల్చి చెప్పలేం.
కాంగ్రెస్ కూడా ఉండే జట్టులో కేసీఆర్ చేరితే అది ఆయనకు ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. గతంలో మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించినందుకు నిరసనగా గైర్హాజరు అయిన కేసీఆర్.. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ లేని కూటమి అసాధ్యం అయితే ఎలా స్పందిస్తారు? ఒకవేళ ఆ కూటమిలో టిఆర్ఎస్ కూడా ఉంటే.. తెలంగాణ రాజకీయాలలో కూడా ఆ స్నేహం కొనసాగుతుందా? వారిద్దరి స్నేహాన్ని భారతీయ జనతా పార్టీ తన ఎడ్వాంటేజీకి వాడుకోకుండా ఉంటుందా? ఇవన్నీ సమాధానం దొరకవలసిన మిలియన్ డాలర్ ప్రశ్నలు!