హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్ణయం తీసుకుంది. సహజంగానే ఈ నిర్ణయం పట్ల ఎన్టీఆర్ వైయస్సార్ అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలతో నిమిత్తం లేకుండా పలువురు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలంగా సాన్నిహిత్యం కొనసాగిస్తున్న వల్లభనేని వంశీ కూడా ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న నిరసన దీక్షలను, పోరాటాలు ప్రదర్శనలు చూసి నందమూరి తారక రామారావు ఆత్మ క్షోభిస్తుందా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతుంది.
ఎన్టీఆర్ పేరును యూనివర్సిటీకి తిరిగి పెట్టడం కంటే మిన్నగా.. ఈ అంశంపై చేసే పోరాటాల ద్వారా తమకు వ్యక్తిగత మైలేజీ పెంచుకోవాలనే యావ తెలుగుదేశం నాయకులలో ఎక్కువగా కనిపిస్తోంది.
ఎన్టీఆర్ పేరు తిరిగి యూనివర్సిటీ వరకు తాము ఊరుకునేది లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్పేశారు. అంటే ఎన్టీఆర్ కు ప్రజల్లో ఉన్న జనాదరణను అడ్డుపెట్టుకుని ఈ విషయంపై సుదీర్ఘకాలం పోరాటాలు చేయాలనే ఆలోచన ఆయనకు ఉన్నట్లు అర్థమవుతుంది.
సొంత భార్య మీద నిందలు వేస్తేనే.. దానిని ఒక ప్రచార అంశంగా, ప్రజల్లో తన పట్ల, తన కుటుంబం పట్ల, తన పార్టీ పట్ల జాలి పుట్టించుకోవడానికి ఒక అస్త్రంగా వాడుకుంటూ రాష్ట్రమంతా తిరిగి ఊరూరా ఆ విషయాన్ని టముకువేసి చెబుతూ, కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక ఎపిసోడ్ నడిపించిన చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని కూడా.. అదే తరహాలో రాజకీయంగా మలచాలని ఆశిస్తున్నారు.
శాసనసభలో ఈ పేరు మార్పు ఆమోదం పొందిన రోజునే రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో తెలుగుదేశం నిరసనలు ప్రదర్శనలు జరిగాయి. అయితే ఈ ప్రదర్శనలలో తెలుగుదేశం నాయకులు వాడిన ఫ్లెక్సీలు చూస్తే కంపరం కలుగుతుంది. ఎన్టీఆర్ కోసం చేస్తున్న నిరసనల్లో.. ఆయన కంటే పెద్దదిగా తమ తమ ఫోటోలు పెట్టుకుని ప్రచారం కక్కుర్తితో ఈ నాయకులు దీక్షలు సాగించడం హేయం!.
ఎన్టీఆర్ పేరు మీద ఏదో ఒక కార్యక్రమం చేయాలి.. కానీ మైలేజీ మాత్రం తమకు పుష్కలంగా రావాలి… ఇదే ధోరణిగా తెలుగుదేశం నాయకుల ప్రదర్శనలు జరిగాయి. ఎవరిలోనూ చిత్తశుద్ధి లేదు. జగన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా మార్చాలనే పట్టుదలలేదు. కేవలం ఒక రాజకీయ డ్రామాగా మాత్రమే ఈ నిరసనలు జరిగాయి.
తన పేరు మీద ఒక డ్రామా నడిపిస్తూ ఇలా దొంగ నిరసనలు తెలియజేయడం చూస్తే.. ఎన్టీఆర్ ఆత్మ కూడా క్షోభిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంత సంకుచితంగా ఆలోచిస్తుంటారు గనుకనే.. తమ వ్యక్తిగత మైలేజీ తప్ప తమ పార్టీ వ్యవస్థాపకుడు గురించి కూడా అంత సీరియస్ గా పట్టించుకోరు గనుకనే జగన్మోహన్ రెడ్డి ఆ పేరును సునాయాసంగా తొలగించగలిగారు.
నిరసనలలో ఎన్టీఆర్ కంటే పెద్దదిగా తమ సొంత ఫోటోలతో స్థానిక నాయకులు కనబరుస్తున్న చౌకబారు ప్రచారకాంక్షను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.