తెలంగాణా ముఖ్యమంత్రి జాతీయ దాహం తీరడంలేదు. తాను జాతీయ నాయకుడిగా ఎదగాలని, సమస్త ప్రతిపక్షాలకు నాయకత్వం వహించాలని ఎన్నో కలలు కంటున్నారు. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాలని తాపత్రయపడుతున్నారు. కానీ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలం కాలేదు.
థర్డ్ ఫ్రంట్ అన్నారు, ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. కానీ ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నుంచి సరైన స్పందనలేదు. జాతీయ రాజకీయాలకు సంబంధించి ఏ పార్టీలనైతే కూడగట్టాలని భావించారో ఆ పార్టీలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు పలికాయి. ఆల్రెడీ ఆమె విజయం ఖాయమైపోయింది.
ఎన్నిక జరగడం కేవలం లాంఛనప్రాయం మాత్రమే. కేసీఆర్ మద్దతు ఇచ్చిన ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మిగిలేది శూన్యమే. ద్రౌపది ముర్ముకు మద్దతు పలికిన బీజేపీయేతర పార్టీలన్నీ మోడీ పేరు చెబితే మండిపడేవే. కానీ దేశానికి మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చినప్పుడు దాని అడ్డుకోవడం విజ్ఞత కాదని భావించాయి.
అందుకే మోడీపై, బీజేపీ మీద కోపం ఉన్నా గిరిజన మహిళ రాష్ట్రపతి అవడాన్ని గర్వకారణంగా భావించి మద్దతు ఇచ్చాయి. కానీ కేసీఆర్ అజెండా మాత్రం మోడీని, బీజేపీపీని వ్యతిరేకించడం మాత్రమే. ఆయన ఇంకేమీ ఆలోచించలేదు.
కేసీఆర్ తనను తాను జాతీయ నాయకుడిగా భావించుకుంటున్నారు కాబట్టి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మీద మూకుమ్మడి దాడి చేయాలని ప్రతిపక్ష ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు పార్లమెంటులో చేసే పని అదే కదా. దానికోసం కేసీఆర్ ప్రత్యేకంగా పిలుపునివ్వాల్సిన అవసరముందా ? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఆప్)కు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (టీఎంసీ) కి, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ కు, తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఆర్జేడీ తేజస్వీ యాదవ్ కు, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కు కేసీఆర్ ఫోన్ చేశారు.
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కడిగిపారేయాలని కోరారు. జాతీయ స్థాయిలో నిరసనలు తెలపాలన్నారు. మోడీ పాలన నుంచి దేశాన్ని రక్షించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినా ప్రతిపక్షాలలో ఐక్యత లేనిదే ఎవరూ ఏమీ చేయలేరు.
కొన్ని నెలల కిందట కేసీఆర్ జాతీయ ప్రయత్నాలకు మద్దతుగా మాట్లాడిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మోడీ ప్రభుత్వం కుట్ర చేసి తనను పదవి నుంచి దింపేసిందని తెలిసినప్పటికీ ద్రౌపది ముర్ముకే మద్దతు ఇచ్చారు.
ఒకప్పుడు కేసీఆర్ తో భేటీ అయిన మాజీ ప్రధాని దేవెగౌడ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇలా మరి కొందరు కూడా కేసీఆర్ కు హ్యాడించ్చారు. ఇదే కేసీఆర్ ఒకప్పుడు అంటే 2014 లో మొదటిసారి సీఎం అయినప్పుడు అప్పుడే మొదటిసారి ప్రధాని అయిన మోడీకి చాలా అంశాల్లో మద్దతు ఇచ్చారు. కానీ మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక, కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక సీన్ మారిపోయింది.