టీడీపీ అధినేత, తన అన్న నారా చంద్రబాబునాయుడికి తమ్ముడైన వైఎస్సార్‌సీపీ కీలకనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ ప్రతిపాదన చేశారు. తమ పార్టీ నేతల్ని విమర్శించకుండా వుంటే, తాము కూడా ఆ పని చేయమని మీడియా ముఖంగా బాబుకు అప్పీల్ చేశారు. మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తనకు చంద్రబాబు అన్నయ్య అవుతారని చెప్పి విజయసాయిరెడ్డి సంచలనం సృష్టించారు.
చంద్రబాబు, టీడీపీ అడాన్ కంపెనీపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. తన కుటుంబానికి అడాన్ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉదాహరణకు దివీస్ ల్యాబ్స్ కిరణ్‌తో క్లోజ్‌గా ఉంటానన్నారు. అదే దివీస్ ల్యాబ్ కిరణ్ సిస్టర్‌తో నారా బ్రాహ్మణికి మంచి స్నేహం ఉందన్నారు. వాళ్లిద్దరూ రోజూ కలుస్తారని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌కి దగ్గరే అన్నారు. చాలా మంది నారా ఫ్యామిలీకి వీళ్లంతా దగ్గరి వాళ్లే అన్నారు. అంత మాత్రాన దివీస్ ల్యాబ్ తనదో లేక నారా ఫ్యామిలీదో అవుతుందా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
వ్యక్తిగత సంబంధాల్ని బట్టి, ఒక కంపెనీలో వున్న డైరెక్టర్లు ఇంకో కంపెనీలో ఉన్నంత మాత్రాన దానిపై ఆరోపణలు చేయడం అసంబద్ధమని విజయసాయిరెడ్డి తెలిపారు. అడాన్‌పై పదేపదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వివరాలు తెప్పించినట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. అడాన్ అనేది లిక్కర్ సరఫరా చేసే 50 కంపెనీల్లో ఒకటన్నారు. ఏపీకి మద్యం సరఫరాలో ఈ కంపెనీ వాటా 3 శాతం అన్నారు. ఆ కంపెనీ డైరెక్టర్లు ఎవరో కూడా తనకు తెలియదన్నారు.
దాన్ని తన కుటుంబానికి ముడిపెట్టారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌నాయుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినట్టైతే …పదింతలు దుష్ప్రచారం చేసే సామర్థ్యం తనకు ఉందని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ రోజు వరకూ నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి గురించి మాట్లాడలేదన్నారు.
ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటుంటే వాటి గురించి మాట్లాడలేదన్నారు. కేవలం రాజకీయ నేతల గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చానన్నారు. పరిధులు దాటవద్దని చంద్రబాబు, లోకేశ్‌కు విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
మీరు పరిధులు దాటితే తాను కూడా పదింతలు చేయాల్సి వస్తుందని గట్టి హెచ్చరిక పంపారు. సోషల్ మీడియాలో తమపై అసభ్యకర పదజాలంతో విమర్శించడం స్టార్ట్ చేశారని విమర్శించారు. తాము కూడా అదే విధంగా రియాక్ట్ అయి నోరు మూయించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
వైఎస్సార్‌సీపీ విలువలున్న పార్టీ అన్నారు. తమ నాయకుడితో పాటు తమను విమర్శించడం మానేస్తే …తాము కూడా విమర్శలు మానేస్తామని టీడీపీకి విజయసాయి బంపర్ ఆఫర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి ఆఫర్‌పై టీడీపీ ఎలా స్పందిస్తుందో మరి!