తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పొగడ్తలతో ముంచెత్తారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సమావేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక ఉపన్యాసం చేశారు.
తన చిరకాల మిత్రుడు కేసీఆర్ అంటూ తమ మధ్య స్నేహాన్ని గుర్తు చేశారు. చేతికి ఎముకలేని తనానికి ట్రేడ్‌మార్క్ కేసీఆర్ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ సందర్భంగా తనకంటే ముందు కేసీఆర్ ప్రసంగిస్తూ న్యాయవ్యవస్థపై కురిపించిన వరాల జల్లే నిదర్శనమని ఎన్వీ రమణ అన్నారు.
తెలంగాణ హైకోర్టు జడ్జిలందరికీ క్వార్టర్స్ నిర్మిస్తామని, అలాగే న్యాయవ్యవస్థలో 4,320కి పైగా ఉద్యోగాల భర్తీ చేపడతామని కేసీఆర్ హామీ ఇవ్వడంపై ఎన్వీ రమణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన చిరకాల కోరికైన ఆర్బిట్రేషణ్ మీడియేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఒకవైపు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత విధిస్తున్న పరిస్థితుల్లో, అందుకు విరుద్ధంగా తెలంగాణలో న్యాయ వ్యవస్థలో ఏకంగా 4,320 ఉద్యోగాలను సృష్టించడం సామాన్యమైన విషయం కాదని కేసీఆర్‌ను అభినందించారు. కేసులు త్వరగా పరిష్కారం కావాలంటే జడ్జిల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ హైకోర్టులో ఇటీవల జడ్జిల సంఖ్యను పెంచామన్నారు. న్యాయ వ్యవస్థను ఇంకా బలపరచాలని భావిస్తున్నట్టు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్యను పెంచుతామన్నారు.