తెలంగాణ ముఖ్యమంత్రి తన భారత రాష్ట్ర సమితిని అధికారికంగా ప్రారంభించిన రోజున.. ముందుగా కర్నాటకలోకి విస్తరించనున్నట్టుగా ప్రకటించారు. ఈ ఏడాది అక్కడ జరిగే ఎన్నికల్లో పోటీచేస్తాం అని కూడా వెల్లడించారు. కుమారస్వామి దన్నుచూసుకుని.. అక్కడి ఎన్నికల గురించి కూడా గులాబీదళపతి మాట్లాడుతున్నారని అంతా అనుకున్నారు గానీ.. ఈనాటికీ ఆయన తొలి ఫోకస్ కర్నాటకలో పార్టీ కమిటీ ఏర్పాటు జరగలేదు. కానీ సోదర తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్ర అధ్యక్షుడిని నియమించేశారు. ఇప్పటికే మూడు పార్టీలు మారిన తోట చంద్రశేఖర్ ఇప్పుడు ఏపీ భారాస సారధి.
ఆయనకు సారథ్య బాధ్యతలు అప్పగించిన సమావేశంలో కేసీఆర్ మరో కీలకమైన సంగతి కూడా బయటపెట్టారు. ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరబోతున్నారని ఆయన వెల్లడించారు. ఈ మాట వినగానే అవునా..? నిజమేనా? అనిపించడం సహజం. ఏపీలో జగన్ ఒకవైపు, టీడీపీ-జనసేన ఒకవైపు ‘మేమే గెలుస్తున్నాం’ అని చాటుకుంటుండగా.. ఆ పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు వారిని వదలి కేసీఆర్ భారాసలోకి ఎందుకు వస్తారు? అనే ప్రశ్న ఉదయిస్తుంది. అయితే చిన్న అవకాశం ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ లో కొందరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమ పనితీరు అత్యంత అసహ్యంగా ఉన్నదని ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో బ్యాడ్ రిమార్క్ సాధించిన వారు. తలకిందులుగా తపస్సు చేసినా సరే.. మళ్లీ టికెట్ దక్కదు అనే క్లారిటీతో వచ్చే ఎన్నికల సమయానికి ఇంకో పార్టీ చూసుకోవాలనే దేవులాటలో ఉన్నారు. అలాగని తెలుగుదేశంలోకి వెళ్లలేని పరిస్థితి కొందరికి ఉంది. స్థానిక సమీకరణలు ఒక కారణమైతే, ఆ పార్టీని ఆల్రెడీ మోసం చేసి ఫిరాయించిన నేపథ్యం ఇంకో కారణం. ఇలాంటి తిరుగుబాటు వైసీపీ ఎమ్మెల్యేలు వేరే గతిలేక భారాసలో చేరితే చేరవచ్చు గాక.. కానీ ఏ మేరకు గెలుపుగుర్రాలు అవుతారనేది మాత్రం చెప్పలేం.
తెలుగుదేశానికి ఆ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేల్లో కొందరు పూర్తిగా నిరాశలో కూరుకుపోయి ఉన్నారు. ఈ పార్టీ ఇక తిరిగి నిలదొక్కుకోవడం అసాద్యం అని నమ్ముతున్నవాళ్లున్నారు. చంద్రబాబు- పవన్ కలిసి ఎన్ని గిమ్మిక్కులు చేసినా సరే.. గెలుపు కష్టం అనేది వారి నమ్మకం. అలాంటి వాళ్లు బీఆర్ఎస్ ను ఆశ్రయించే చాన్సుంది.
కేసీఆర్ ప్రకటించిన మేరకు ఏపీలో ఎమ్మెల్యేలు వచ్చి చేరడమే నిజమైతే గనుక.. అధికార విపక్ష పార్టీల్లో ఒకటిరెండు వికెట్లు పడే అవకాశం ఉంది. మరి ఆ ఎమ్మెల్యేలకు తానేం ఎర వేశారో మాత్రం కేసీఆర్ చెప్పలేదు.