రెక్కలు తొడుక్కుంటున్న గులాబీ చిలకలు!

గులాబీ చిలకలు రెక్కలు తొడుక్కుంటున్నాయి. ఇవాళో రేపో రివ్వున ఎగిరిపోనున్నాయి. దోర దోర జాంపండులెన్నో సేకరించి.. తోటి చిన్న చిలకలకు, పెద్దచిలకలకు విందు చేశాయి. రుచికరమైన విందుభోజనాలను ఆరగించిన చిలకలన్నీ.. రెక్కల చిలకలకు జేజేలు…

గులాబీ చిలకలు రెక్కలు తొడుక్కుంటున్నాయి. ఇవాళో రేపో రివ్వున ఎగిరిపోనున్నాయి. దోర దోర జాంపండులెన్నో సేకరించి.. తోటి చిన్న చిలకలకు, పెద్దచిలకలకు విందు చేశాయి. రుచికరమైన విందుభోజనాలను ఆరగించిన చిలకలన్నీ.. రెక్కల చిలకలకు జేజేలు కొట్టాయి. మేం మీ మందలోని చిలకలం.. మీరు ఎటు ఎగిరితే మేం కూడా అటు ఎగురుతాం అని మాట ఇచ్చాయి. పెట్టిన విందు వృథాకాలేదనే సంతోషంతో.. రెక్కలు తొడుక్కున ఈ గులాబీ చిలకలు.. కొత్త తీరాలతో బేరాలు మాట్లాడుకుంటున్నాయి. 

ఖమ్మం జిల్లా గులాబీ రాజకీయం ఇది! ఖమ్మం జిల్లాలో భారాసకు ఓ మోస్తరు బలం ఉంది. గత ఎన్నికల్లో రెండు మినహా అన్ని సీట్లను వారే గెలిచారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం భారాసలో ఉన్న ఇద్దరు కీలక నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. నూతన సంవత్సరం రోజున భారీస్థాయిలో విందులు ఏర్పాటుచేశారు. వేల సంఖ్యలు జిల్లా వ్యాప్తంగా ఉన్న వారి అభిమానులు, కార్యకర్తలు ఈ విందులను ఆరగించారు. తుమ్మల నాగేశ్వరరావు ఆచితూచి మాట్లాడుతూ చాలా గుంభనంగా ఉన్నప్పటికీ.. పొంగులేటి మాటల్లో పార్టీ మారే సంకేతాలు కొన్ని వెలువడ్డాయి. 

తనతో పాటు ఆ వేదిక మీద ఉన్న వారిలో అర్హత ఉన్న వారంతో వచ్చే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా పోటీచేస్తారని తానే ప్రకటించేశారు. భారాస పార్టీకి సంబంధించినంత వరకు పొంగులేటికే దిక్కులేదు. మరి తన చుట్టూ ఉన్న వారంతా పోటీచేస్తారని ఆయన చెప్పడం కామెడీ అనిపించుకుంటుంది. ఆయన పార్టీ మారడం ఖరారైనట్టే. కాకపోతే తెలంగాణలో బలపడి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న బిజెపిలోకి వెళ్తారా? లేదా, తన అస్తిత్వం చాటుకుని వైఎస్సార్ తనయగా తెలంగాణ రాజకీయాల్లో ఒక ముద్ర వేయాలని చూస్తున్న షర్మిల పార్టీలో చేరుతారా? అనేది ప్రశ్న. 

వైఎస్సార్ కుటుంబంతో పొంగులేటికి సాన్నిహిత్యం ఉంది. జగన్ 2014లో ఆయన గెలుపుకోసం చాలా కష్టపడ్డారు. తెలంగాణ మీద తనకు శ్రద్ధ లేకపోయినా వచ్చి ప్రచారం చేశారు. పొంగులేటిని కేంద్రమంత్రిని చేయిస్తానని కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టే ఆయన గెలిచారు. ఆతర్వాతి పరిణామాల్లో జగన్ తన రాజకీయాలను ఏపీకి పరిమితం చేసుకున్న తర్వాత పొంగులేటి గులాబీ పార్టీలో చేరారు. అక్కడ కొన్నాళ్లకు ఆయనను లూప్ లైన్ లో పెట్టారు. 

గత నాలుగున్నరేళ్లలో తమకు ఏపాటి గౌరవం దక్కిందో అందరికీ తెలుసునని, భవిష్యత్తులో దక్కే గౌరవం ఏమిటో ఆలోచించాల్సి ఉన్నదని పొంగులేటి విందు సమావేశంలో చెప్పడం చాలా కీలకంగా మారుతోంది. ఆయన పార్టీ మార్పు ఖరారే గానీ.. ఎవరి పార్టీలోకి వెళ్తారనే సంగతి తేలడం లేదు. 

తుమ్మల నాగేశ్వరరావు కూడా భారాసపై చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆయనకోసం భాజపా బాగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బిజెపిలోకి వెళ్తారా ? లేదా, తెలంగాణలో మళ్లీ బలపడాలని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పంచన చేరి తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంటారా? అనేది వేచిచూడాలి.