పవన్ కల్యాణ్.. గోడమీది పిల్లి డైలాగులు!

కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించి తీరాల్సిందే అంటూ వృద్ధ నాయకుడు హరిరామజోగయ్య ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేయడం ఎటూ తప్పకుండా జరుగుతుంది. తనను…

కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించి తీరాల్సిందే అంటూ వృద్ధ నాయకుడు హరిరామజోగయ్య ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేయడం ఎటూ తప్పకుండా జరుగుతుంది. తనను ఆస్పత్రికి తరలించినా అక్కడ కూడా దీక్ష చేసి తీరుతానని ఈ 85 ఏళ్ల వృద్ధ నాయకుడు చాలా పట్టుదలతో అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు. 

గతంలో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ తొలిరోజుల్లో హరిరామజోగయ్య చాలా అండగా ఉన్నారు. ఒకే సామాజిక వర్గం కావడం వల్ల.. పవన్ కల్యాణ్ కు బహుధా మార్గదర్శనం చేశారు. పవన్ కల్యాణ్ పట్ల ఇప్పటికీ అభిమానంతోనే ఉంటారు. అలాంటి హరిరామజోగయ్య ఆమరణ నిరాహార దీక్షచేస్తోంటే పవన్ కల్యాణ్ స్పందించిన తీరు చాలా చిత్రంగా ఉంది. కాపులకు కోపం తెప్పించేలా కూడా ఉంది. 

జోగయ్యకు పవన్ కల్యాణ్ ఫోను చేసి మాట్లాడారు. ఆయన దీక్ష నేపథ్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో కూడా మాట్లాడారని వార్తలు వచ్చాయి. అయితే ఈ సందర్భంగా పవన్ ఏం చెప్పారు?

85 ఏళ్ల వయసులో హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్నారని.. ఆయన దీక్షపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని మాత్రమే ఆయన అంటున్నారు. స్పందించడం అంటే పవన్ కల్యాణ్ ఉద్దేశం ఏమిటో బోధపడ్డం లేదు. ఆయన వృద్ధుడు గనుక, దీక్ష ప్రమాదం గనుక.. ప్రభుత్వం స్పందించబట్టే.. ఆయనను బలవంతంగా  అయినా ఆస్పత్రికి తరలించారు. అది ప్రభుత్వ స్పందనే కదా. అది కాదు.. కాపులకు రిజర్వేషన్లు తక్షణం ఇచ్చి తీరాల్సిందే అనేట్లయితే గనుక.. పవన్ కల్యాణ్ తన నోటితో ఆ డిమాండ్ వినిపించవచ్చు కదా..! కానీ, అలా చేయరు. 

తన నోటితో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనే డిమాండ్ పవన్ కల్యాణ్ పొరబాటున కూడా అనరు. ఒకటి- తనమీద కాపునాయకుడనే ముద్ర వేస్తారనే భయం. రెండు- రేపు తనే అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదనే మహాభయం. ఈ కారణాల వల్ల ఆయన కాపులకు ఫేవర్ గా తాను మాట్లాడరు. తన పార్టీ వారిని మాట్లాడనివ్వరు. జోగయ్య దీక్ష చేస్తానంటే.. ప్రభుత్వం స్పందించాలని మాత్రం అంటారు. 

పవన్ కల్యాణ్ పైకి తాను విశ్వమానవుడిని అని చెప్పుకుంటారు. తనకు కులం మతం లాంటివేమీ లేవని కాపుల జనాభా అత్యధికంగా ఉండే నియోజకవర్గాలను మాత్రమే ఎంచుకుని పోటీకి దిగుతారు. అయితే కాపుల కోసం ఒక మాట మాట్లాడితే మిగిలిన కులాల ఓట్లు దూరమైపోతాయని భయపడే ఈ జనసేనాని.. కాపులకోసం ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఉన్నందుకు ఆ కులం మొత్తం అసహ్యించుకుంటుందని ఎందుకు గుర్తించలేకపోతున్నారు. ఈ గోడమీద పిల్లి వైఖరే పవన్ కల్యాణ్ కు చేటు చేస్తున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.