ప్రొఫెసర్ కు ఎర: రాజ్యసభ ఎంపీనా? ఎమ్మెల్సీనా?

తెలంగాణ జనసమితి అద్యక్షుడు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఐక్యకార్యచరణ సమితికి సంధానకర్తగా కీలక భూమిక పోషించనున్న ప్రొఫెసర్ కోదండరాం కొత్త భూమిక లోకి ప్రవేశించబోతున్నారా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం…

తెలంగాణ జనసమితి అద్యక్షుడు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఐక్యకార్యచరణ సమితికి సంధానకర్తగా కీలక భూమిక పోషించనున్న ప్రొఫెసర్ కోదండరాం కొత్త భూమిక లోకి ప్రవేశించబోతున్నారా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తిరిగి తన ప్రొఫెసర్ పదవిలోకి వెళ్లిపోయిన కోదండరాం, పదవీవిరమణ అనంతరం తెలంగాణ జనసమితిని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. 

అలాంటి కోదండరాం ప్రస్తుత ఎన్నికల వేళకు.. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయవచ్చుననే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. అందుకు ప్రతిగా ప్రొఫెసర్ సాబ్ కు రాజ్యసభ ఎంపీ పదవి గానీ, ఎమ్మెల్సీ పదవిగానీ ఆఫర్ చేయబోతున్నట్టుగా అంచనాలు సాగుతున్నాయి.

ప్రొఫెసర్ కోదండరాం శుక్రవారం, కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ విజయానికి సహకరించాల్సిందిగా.. రాహుల్ గాంధీ, ఆయనను కోరే అవకాశం ఉంది. నిజానికి కేసీఆర్ వ్యతిరేకతతోనే సొంత పార్టీ కూడా స్థాపించి ప్రస్థానం సాగిస్తున్న కోదండరాం గత ఎన్నికల్లో కూడా కాంగ్రెసుకు అనుకూలంగానే పనిచేశారు. కాంగ్రెసు మద్దతు తీసుకుని ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ నెగ్గలేకపోయారు.

భారాసను నిలువరించడానికి ప్రత్యర్థులకు ఎంతో కీలకమైన ఈ ఎన్నికల సమయంలో కోదండరాం తాను స్థాపించిన తెలంగాణ జనసమితి పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే ఆలోచనను తెరపైకి తెచ్చారు. వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రతిపాదన తెచ్చినప్పుడే.. కోదండరాం ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. అధిష్ఠానంతో రెండు విడతల మంతనాల తర్వాత షర్మిల వెనక్కు తగ్గారు. వారి మధ్య డీల్ కుదరలేదు. అయితే కోదండరాం సంగతి తేలలేదు.

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీతో శుక్రవారం కోదండరాం సమావేశం కాబోతున్నారు. ప్రత్యక్ష ఎన్నికలలో ఆయన విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో పార్టీ టికెట్ ఆశించకుండా ఉంటే.. ఇతర పదవులను కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధంగానే ఉన్నదని సమాచారం. కేవలం పార్టీ టికెట్ ఇచ్చినంత మాత్రాన ఇతరత్రా కూడా అభ్యర్థి బలంగా ఉండకపోతే.. ఈ ఎన్నికల్లో కష్టం అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. 

అందుకే ఆయనకు రాజ్యసభ ఎంపీ పదవి గానీ, ఆయన కోరిక మేరకు ఎమ్మెల్సీ పదవి గానీ ఆఫర్ చేయడం ద్వారా.. పార్టీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం. రాహుల్ గాంధీతో భేటీలో ఆ విషయానికి తుదిరూపు ఇస్తారని అనుకుంటున్నారు. విలీనం తర్వాత.. ప్రొఫెసర్ కోదండరాం ను రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో కీలకంగా వాడుకోవాలని పార్టీ అనుకుంటోంది.