సభలోకి లైన్ క్లియర్.. కేబినెట్‌లోకి వస్తారా?!

ప్రొఫెసర్ కోదండరాం కు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కీలకంగా పనిచేసిన ఈ నాయకుడు.. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత మొట్టమొదటిసారిగా చట్టసభలలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయనను గవర్నరు కోటాలో…

ప్రొఫెసర్ కోదండరాం కు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కీలకంగా పనిచేసిన ఈ నాయకుడు.. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత మొట్టమొదటిసారిగా చట్టసభలలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయనను గవర్నరు కోటాలో ఎమ్మెల్సీ చేసేందుకు కాంగ్రెసు ప్రభుత్వం నిర్ణయించింది. చట్టసభలో అడుగుపెట్టబోతున్న ప్రొఫెసర్ కోదండరాం అటునుంచి రేవంత్ కేబినెట్లో కూడా చోటు సంపాదించుకుంటారా? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన కసరత్తును కాంగ్రెస్ సర్కారు పూర్తిచేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న ఎన్నికల జరగాల్సి ఉండగా ఆ రెండు స్థానాలూ కూడా అధికార పార్టీకే దక్కే అవకాశం ఉంది. ఆ రెండు సీట్లకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది.

అయితే ఈ విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. పార్టీ సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్, యువనేత బల్మూరి వెంకట్ లను ఎమ్మెల్సీలు చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో మారింది. అద్దంకి దయాకర్ పేరును తప్పించి.. ఆ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రకటనలోకి వచ్చింది. దీంతో దయాకర్ అభిమానులు ఖంగుతిన్నారు.

అద్దంకి దయాకర్ మాత్రం పాజిటివ్ గానే స్పందించారు. పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని ఆయన అన్నారు. పార్టీ తనకు ఇంతకంటె మంచి పదవి కట్టబెట్టడం కోసం ప్రస్తుతానికి ఎంపిక చేయలేదని భావిస్తున్నట్టుగా అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు.

అలాగే.. గవర్నరు కోటలో ప్రొఫెసర్ కోదండరాంపేరును ఎంపిక చేశారు. అయితే గవర్నరు కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండడంతో గవర్నరు తమిళిసై ప్రస్తుతానికి నియామకానికి బ్రేకు వేశారు. అయితే ఇది సుదీర్ఘకాలం కొనసాగే సమస్య కాదు. తొందరగానే ఒక కొలిక్కి వస్తుందని పలువురు భావిస్తున్నారు.

ప్రొఫెసర్ సాబ్ శాసనమండలిలోకి అడుగుపెట్టడం ఖరారైనట్టే. ఇక ఇప్పుడాయన రేవంత్ కేబినెట్ లోకి వస్తారా? లేదా? అనే చర్చ మొదలవుతోంది. చాలా మంది కేబినెట్లోని సహచరుల కంటె ప్రొఫెసర్ కోదండరాంకు చిత్తశుద్ధి గల, పరిపాలన అవగాహన, జ్ఞానం గల వ్యక్తిగా పేరుంది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆయన జేఏసీ కన్వీనర్ గా ఎంతో సంయమనంతో వ్యవహరించడమే రాష్ట్ర సాధనకు ప్రధానంగా ఉపకరించింది. అటువంటి వ్యక్తిని కేబినెట్లోకి తీసుకుని రేవంత్ సముచితంగా వాడుకుంటారని పలువురు ఆశిస్తున్నారు.