సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయనే సంగతి తెలుసు. కొన్ని వచ్చాయి, మరిన్ని రాబోతున్నాయి. సలార్ సినిమా కూడా వచ్చింది. దానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే ప్రచారంలో కూడా సీక్వెల్స్ ఉంటాయా? సలార్ యూనిట్ ను చూస్తే ఉంటాయనే అనిపిస్తోంది.
హంగామా అంతా అయిపోయిందనుకున్న సినిమాకు మళ్లీ ప్రచారం షురూ చేసింది సలార్ యూనిట్. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.
సలార్ సినిమా రిలీజై రేపటికి 4 వారాలు అవుతోంది. ఈకాలం ఏ సినిమాకైనా 4 వారాల టైమ్ అంటే, దాదాపు రన్ ముగిసినట్టే. సలార్ హవా కూడా తగ్గింది. కానీ యూనిట్ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.
రీసెంట్ గా సక్సెస్ పార్టీ పేరిట సలార్ యూనిట్ మరోసారి కలిసింది. పార్టీ చేసుకుంది. ఆ వెంటనే మరోసారి ప్రచారం మొదలుపెట్టింది. తాజాగా శృతిహాసన్, ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమారన్ తో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ప్రభాస్, పృధ్వీరాజ్ ను శృతిహాసన్ ఇంటర్వ్యూ చేసింది. అలా సలార్ పార్ట్-1 కు రెండో విడత ప్రచారం మొదలుపెట్టారు.
ఈ ఇంటర్వ్యూలో మరికొన్ని సంగతులు పంచుకున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ తొలిసారి తనకు నెరేషన్ ఇచ్చినప్పుడు అస్సలు అర్థం కాలేదంట. సరిగ్గా నెరేషన్ ఇవ్వలేదన్నాడు ప్రభాస్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ అంటే ఏంటో అర్థమైందని.. తన కెరీర్ లోనే మోస్ట్ కంఫర్టబుల్ డైరక్టర్ అని చెప్పుకొచ్చాడు.
తన 21 ఏళ్ల కెరీర్ లో వీవీ వినాయక్ తో చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేశానని, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ను మాత్రమే చూశానని అన్నాడు ప్రభాస్. షూటింగ్ అయిన తర్వాత కూడా ప్రశాంత్ తో సమయం గడపాలని అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. రెండో విడత ప్రచారంతో సలార్ కు మరిన్ని కలెక్షన్లు వస్తాయేమో చూడాలి.